‘మీ సేవ’లు.. డోర్ డెలివరీ!

24-09-2026 | 05:05am
  1. ఇంటి ముంగిట్లోకి సర్టిఫికెట్లు, ఇతర సేవలు
  2. తొలి దశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో అమలు
  3. ‘డిజిటల్ గవర్నెన్స్’లో రోల్‌మోడల్‌గా తెలంగాణ
  4. ‘మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : ‘గుడ్ గవర్నెన్స్(Good Governance)’కు టెక్నాలజీని జోడించి ‘డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) పేర్కొన్నారు. పౌర సేవల్ని నేరుగా ఇంటి ముంగిటకే చేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బుధవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో ‘మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్(Mee Seva Door Delivery Services)’ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలనలోనూ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అడ్మినిస్ట్రేషన్‌కు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారితనం, సుపరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం, యంత్రాంగం నేరుగా ప్రజల దగ్గరికే వెళ్లేలా ఈ ‘డోర్ డెలివరీ సర్వీసెస్’కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

1100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే జనన/మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర సేవలను ఇంటి దగ్గరే అందుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, వీఎల్‌ఈలకు శిక్షణ ఇచ్చామన్నారు.

తొలిదశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తామని చెప్పారు. పౌరులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీఈ అండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, మీ సేవా కమిషనర్ రవికిరణ్, టీజీటీఎస్ ఎండీ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు