సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా

07-09-2026 | 10:47pm

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన

కోదాడ,(విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు(Unemployed youth) ఉపాధి కల్పించేందుకు నిరంతర కృషి అవసరమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. విద్యావంతులైన యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వం, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థల సమిష్టి బాధ్యత అని, నిరుద్యోగ సమస్య ఒక్క జాబ్ మేళాతో పరిష్కారం కాదని, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోదాడ పట్టణంలోని సి.సి. రెడ్డి కాన్వెంట్ స్కూల్‌లో మెగా జాబ్ మేళా(Mega Job Fair) నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

తెలంగాణ పరిశ్రమల శాఖ, సింగరేణి సంస్థ(Singareni company) సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఈ మేళా జరుగుతుందని, గతేడాది అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో 40 వేల మంది నమోదు కాగా 20,463 మంది ఇంటర్వ్యూలకు హాజరై 2,041 మంది ఉద్యోగాలు పొందారని, మరో 1,533 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారని గుర్తు చేశారు. ఈ జాబ్ మేళా నిర్వహణకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ తదితరులు సభ్యులుగా ఉంటారని, అభ్యర్థుల నమోదు, కంపెనీల భాగస్వామ్యం, రవాణా, భద్రత తదితర ఏర్పాట్లను కమిటీ సమన్వయం చేస్తుందని, తొలి సమావేశం సెప్టెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో జరుగుతుందని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు