మిడ్ డే మీల్స్ పెట్టించని ప్రధానోపాధ్యాయునిపై ఫిర్యాదు

01-10-2026 | 08:32pm

నిజామాబాద్, అక్టోబర్ 01 (విజయ క్రాంతి) : మిడ్ డే మీల్స్ పెట్టకుండానే పెట్టినట్లు తప్పుడు లెక్కలు చూపించిన ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన ఘటన వెలుగు చూసింది. పాఠశాలలలో విద్యార్థులకు తప్పనిసరిగా మిడ్ డే మిల్స్ పెట్టించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయునిది కానీ ఏకంగా వారం రోజులు మిడ్ డే మిల్స్ పెట్టకుండానే పెట్టినట్లుగా తప్పుడు లెక్కలు చూపెట్టి అక్రమాలకు పాల్పడ్డ ప్రధానోపాధ్యాయునిపై సహోపాధ్యాయుడు ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాలలోకి వెళితే...

డిచ్పల్లి మండలం కమలాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ గత నెల (సెప్టెంబర్) 15 నుండి 22 వరకు మిడ్ డే మీల్స్ ఏజెన్సీ ద్వారా భోజనాన్ని ప్రిపేర్ చేయించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఫలితంగా విద్యార్థులు కొందరు మధ్యాహ్నం పస్తులు ఉండడం మరికొందరు ఇండ్లలోకి వెళ్లి భోజనం చేయడం జరిగింది. భోజనాన్ని అందించని ఏడు రోజుల కాలానికి సంబంధించి భోజనాన్ని పెట్టించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించడం,

బియ్యాన్ని మాయం చేయడం మరొక అధికార దుర్వినియోగం. మిడ్ డే మీల్స్ పెట్టకుండా పెట్టినట్లు బిల్లులు ఎలా క్లెయిమ్ చేస్తారని ప్రశ్నించినందుకు సదరు పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ పట్ల కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతున్న క్రమంలో ప్రధానోపాధ్యాయుని  అనుమతితో రెండు రోజులు లీవ్ లో ఉండగా (సెప్టెంబరు 22,24) సెలవు అనుమతి తీసుకోలేదని తప్పుడు పద్ధతిలో మెమో ఇవ్వడంతో హెడ్ మాస్టర్ తనను వేధిస్తున్న విషయం తో పాటు మిడ్ డే మీల్స్ అక్రమాలపై చర్య తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సదరు ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇది ఇలా ఉండగా గత విద్యా సంవత్సరం (2025--26) ఓపెన్ స్కూల్ లో సుమారు 60 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందగా పరీక్షల సమయంలో వారి నుండి ఫీజులు కట్టించుకోకుండా పరీక్షలు రాయించకుండా 60 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు అన్యాయం చేసినట్లు కూడా ఫిర్యాదు లో పేర్కొన్నాడు. చంద్రశేఖర్ చేసిన ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్య(RJDSE) వరంగల్ కూడా పంపినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు