చాకలి ఐలమ్మకు మంత్రుల ఘన నివాళి
భూమి.. భుక్తి.. ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి
మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి
కరీంనగర్, సెప్టెంబర్ 26: : దొరల పాలనను ధిక్కరించి, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) ఆశయాలు చిరస్మరణీయమని మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి(Vakiti Srihari) అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని(Karimnagar Collectorate Road) ఆ మహనీయురాలు విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. చాకలి ఐలమ్మ జీవితాన్ని, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోతకొండ శ్రీనివాస్, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోతకొండ రాజయ్య, పూసల శ్రీకాంత్, బుత్కురి శివకృష్ణ, పూసాల సంపత్ తదితరులు పాల్గొన్నారు.