గ్రామపంచాయతీ నిధులు గోల్ మాల్
- వార్డు సభ్యులకు తెలియకుండానే తీర్మానాలా..?
స్టాక్ రిజిస్టర్, మినిట్స్ బుక్, ఎంబీలు ఎక్కడ..?
తప్పుడు బిల్లులతో ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు
కోటపల్లి, సెప్టెంబర్ 7 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ అ భివృద్ధికి వినియోగించాల్సిన ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారంటూ గ్రామానికి చెందిన కొండ్రా సుదర్శన్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధుల ఖర్చులకు సంబంధించిన బిల్లులు, రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం..
2026, జూలై 22న మల్లంపేట గ్రామపంచాయతీ పౌర సమాచార అధికారికి ఆర్టీఐ చట్టం-2005 కింద దరఖాస్తు చేసి, 2025 డిసెంబర్ 1 నుంచి 2026 జూలై 22 వరకు పంచాయతీ వద్ద ఉన్న మిగులు నిధులు, గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులు, ఇతర వివరాలను కోరారు.
ఇందుకోసం 350 పేజీల సమాచారానికి సంబంధించి చెన్నూరు ట్రెజరీలో రూ. 700 రుసుము చెల్లించినట్లు పే ర్కొన్నారు.అనంతరం ఆగస్టు 20న పౌర స మాచార అధికారి నుంచి లిఖితపూర్వకంగా సమాచారం అందిందని, అయితే అందులో సరైన బిల్లులు, ట్యాక్స్ బిల్లులు లేకుండా కేవలం రాతపూర్వక వివరాలు మాత్రమే ఉన్నాయని సుదర్శన్ ఆరోపించారు. పంచాయతీ ఖర్చులకు సంబంధిం చిన అసలు రికార్డులు, బిల్లులు స్పష్టంగా లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీతెలిపారు.
వార్డు సభ్యులకు తెలియకుండానే తీర్మానాలా..?
పంచాయతీ తీర్మానాల విషయంలోనూ అనుమానాలు ఉన్నాయని సుదర్శన్ పేర్కొన్నారు. ఈ విషయమై ప్రజల చేత ఎన్ను కోబడిన వార్డు సభ్యులను వివరణ కోరగా, తమకు తెలియకుండానే తీర్మానాలు రాసి, మధ్యలో ఖాళీలు వదిలి అనంతరం తమకు అనుకూలంగా వివరాలు పొందుపరిచారని కొందరు వార్డు సభ్యులు తెలిపినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్, మినిట్స్ బుక్, ఎంబీలు (మెజర్మెంట్ బుక్స్) వంటి కీలక రికార్డులను పరిశీలించాలని సుదర్శన్ డి మాండ్ చేశారు. ప్రజాధనం ఖర్చు చేసిన తీరుపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అధికారు లు తక్షణమే విచారణ చేపట్టి, రికార్డులను పూర్తిగా పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బా ధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరుతున్నారు.
