'హైదరాబాద్ తగలబడిపోతుంది'.. భగ్గుమన్న దానం

01-10-2026 | 01:24pm

హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని పెంచింది. ఓట్ల తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender Comments) ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే.. ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుంది” అని వ్యాఖ్యానించారు. తన డివిజన్‌లోనే సుమారు 20 వేల ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు.

ఎన్నికల కమిషన్( Election Commission) అధికారులు బీజేపీతో కలిసి ఓట్లను తొలగించారని దానం నాగేందర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఎన్నికల అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై సమగ్రంగా పరిశీలన జరిపి, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడాలని కోరారు. దానం నాగేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఓట్ల తొలగింపుపై ఆయన చేసిన ఆరోపణలు, ముఖ్యంగా 20 వేల ఓట్ల తొలగింపు అంశంపై అధికారిక వివరాలు, ఎన్నికల కమిషన్ స్పందన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు