మూసీపై వంతెన.. ఏండ్లు గడిచినా అంతేనా?

30-09-2026 | 05:05am
  1. శూన్యపహాడ్-దామరచర్ల గ్రామాల మధ్యలో మూసీపై ప్రమాదకర స్థితిలో వంతెన 
  2. నల్లగొండ, -సూర్యాపేట జిల్లాలకు మధ్య వారధి అదే..
  3. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీ
  4. కూలిపోయిన రెయిలింగ్
  5. మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల వేడుకోలు 

దామరచర్ల, సెప్టెంబర్ 29 : నల్లగొండ, సూర్యపేట(Nalgonda, Suryapet) రెండు జిల్లాల మధ్య వారధి గా ఉన్న దామరచర్ల మండలం(Damaracharla Mandal) పాలకవిడు మండలాల మధ్య మూసీ నది(Musi River) పై గల మూసీ వంతెన(Musi Bridge) ప్రమాదకరంగా తయారైంది. దింతో వాహన దారులు భయాందోళనకు గురైతున్నారు. ఈ వంతెన పై నుండి నిత్యం పెద్దఎత్తున వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. సిమెంట్ పరిశ్రమలకు(Cement industries) చెందిన వాహనాలు అధికంగా వెళ్తుంటాయి. నాపరాయి వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగె జానపహాద్ దర్గా కు కూడా ప్రతి వారం భక్తులు పెద్ద ఎత్తున వాహనాలలో వచ్చి వెళ్తుంటారు.

ఇలా రద్దీ గా వునే మూసీ వంతెన ప్రమాదకరంగా మారింది.వంతెన కు ఇరువైపుల గల రైలింగ్ పలు చోట్ల శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని చోట్ల కూలిపోయింది. ఫలితంగా వంతెన ప్రమాదకరంగా మారిపోయింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మూసీ నదిలో పడిపోయే ప్రమాదం ఉంది. ద్విచక్ర వాహన దారుల పరిస్తితి మరింత దయనీయంగా తయారైంది. రైలింగ్ కూలిపోయి ఎంతోకాలం అవుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదని వాహన దారులు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగేదాక ఎవరు పట్టించుకునే అవకాశాలు లేకపోవడం గమనార్హం. మూసీ నదిపై వంతెన ఏళ్లు గడిచిన అంతేనా అనే అనుమానాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి.

ఓవర్ లోడ్‌తోనే ప్రమాదం

 ఓవర్ లోడ్ వాహనాల రాకపోకల కారణంగా కూడా వంతెన దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో గల సిమెంట్ ,ఇతరత్రా పరిశ్రమలకు చెందిన వాహనాలు ఓవర్ లోడ్ తో రాకపోకలు కొనసాగిస్తుండడం వల్ల కూడా వంతెనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు.వంతెన మీదుగా ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని , వంతెనను కాపాడాలని ప్రజలు కోరుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. దింతో వాహనాల రాకపోకలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.దింతో వంతెన అవతలి భాగంలో గుంతలు పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల వంతెన పై సిమెంట్ , కంకర లేచిపోయి,  ఇనుప సువ్వలు బయట పడి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారినట్లు ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

రెండు జిల్లాలను కలిపే వారధి

ఈ మూసీ వంతెన కారణం గా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మధ్య రాకపోకలు అనువుగా మారాయి. ఏ పని వున్నా ఇటు వారైనా ,అటు వారైనా చుట్టూ తిరిరిగి వెళ్లాల్సి వచ్చేది. కానీ వంతెన నిర్మాణంతో ఎంతో సులువుగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు సూర్యాపేట జిల్లా మట్టపల్లి దేవస్థానానికి హుజూర్ నగర్ మీదుగా, జాన్ పహాడ్ దర్గా కు నేరెడుచర్ల మీదుగా వెళ్లేవారు. ఆ ప్రాంత ప్రజలు కల్లేపల్లి మైసమ్మ ఆలయం , వాడపల్లి శివాలయానికి రావాలంటే మిర్యాలగూడ మీదుగా ఎంతో వ్యయ ప్రయాసలకు ఎదుర్కొంటు వచ్చి వెళ్లేవారు. కానీ వంతెన నిర్మాణంతో ఆ ఇబ్బందులు తొలిగిపోయాయి. కొన్ని గంటల వ్యవధిలోనే సులువుగా ప్రయాణం పూర్తి అయిపోయింది. ఎన్ని ఉపయోగాలున్న వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో దానిపై ప్రయాణానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఇప్పటికైనా ఆ వంతెనకు మరమ్మతులు చేయించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

మరమ్మతులు చేయించాలి

మూసీపై వంతెన శిధిలావస్థకు చేరడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కాబట్టి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి. వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ కూలిపోయిన చోట కొత్తవి నిర్మించాలి. శిథిలావస్థకు చేరిన చోట కూడా కొత్తవి నిర్మించాలి. వంతెన పై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలి. వంతెన మీదుగా ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్లకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి.                    - 

 ఆర్.రమేష్, సర్పంచ్, 

గణేష్ పహాడ్

మరిన్ని వార్తలు