11 June, 2026 | 3:17 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

11-06-2026 02:13 PM

న్యూఢిల్లీ: 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించే దిశగా, సమ్మిళిత మానవాభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం(NITI Aayog Governing Council Meeting) గురువారం జరిగింది. సమావేశానికి సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, ఇతర సభ్యులు హాజరయ్యారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం, ప్రగతిపై శ్రద్ధ వహించేలా కార్యాచరణపై చర్చించారు.

నాలుగు ముఖ్యాంశాల ఆధారంగా నీతిఆయోగ్ పాలక మండలి చర్చలు జరిపింది. అందరికీ సమాన అవకాశాలపై ప్రధాని, సీఎంలు, గవర్నర్లు, కేంద్రమంత్రులు చర్చించారు. డిసెంబర్ 26-28, 2025 మధ్య జరిగిన ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సదస్సు సిఫార్సులపై కూడా పాలక మండలి దృష్టి సారిస్తుంది. సాధారణంగా, పూర్తి కౌన్సిల్ సమావేశం ప్రతి ఏటా జరుగుతుంది. గత ఏడాది ఇది మే 24న జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి హాజరైన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఉన్నారు.