బోధనేతర భారం తగ్గించాలి!
మానేటి ప్రతాపరెడ్డి :
ప్రాథమిక పాఠశాల(Primary school) అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పునాది విద్య అందించే వేదిక. ఆ పునాది బలంగా ఉంటేనే విద్యార్థి భవిష్యత్తు(Student Future) బలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పాఠశాలలో ఐదు తరగతులు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉండగా సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం పెద్ద సమస్య. ఒక్కో తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడు(Teacher) ఉన్న పాఠశాలలో పరిస్థితి కొంత సులభంగా ఉంటుంది. కానీ ఇద్దరు, ముగ్గురు ఉన్న స్కూళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ ఆలోచించాలి.
ఒక ఉపాధ్యాయుడు ఒకేసారి రెండు, మూడు తరగతులను ఎలా సమర్థంగా నిర్వహించగలడు? విద్యార్థులందరికీ వ్యక్తిగత శ్రద్ధ ఎలా అందించగలడు? తల్లిదండ్రుల అంచనాలను ఎలా అందుకోగలడు? ఉపాధ్యాయుడి ప్రధాన బాధ్యత బోధన. కానీ గత కొంతకాలంగా టీచర్ల చుట్టూ బోధనేతర బాధ్యతలు పెరుగుతున్నాయి.
పాఠశాలకు సంబంధించిన నివేదికలు.. రికార్డులు.. ఆన్లైన్ వివరాల నమోదు(Online Details Entry).. తనిఖీ అధికారుల సందర్శనలకు సమాధానాలు.. పరీక్షల నిర్వహణ.. ఫలితాల విశ్లేషణ.. శిక్షణ కార్యక్రమాలు.. వివిధ సర్వేలు.. శాఖాపరమైన సమాచార సేకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉపాధ్యాయుడి సమయాన్ని తీసుకునే పనులు ఎన్నో. ఫలితంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఇన్ని బాధ్యతల ను ఇద్దరు, ముగ్గురు ఎలా సమన్వయం చేయగలరు? ఇది ఒక పాఠశాల సమస్య కాదు. టీచర్ల కొరత ఉన్న అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి.
ఆ ఉపాధ్యాయుడి ఆవేదనను అర్థం చేసుకోవాలి!
జగిత్యాల జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులతో ఐదు తరగతులను నిర్వహిస్తున్న ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ తీవ్ర ఒత్తిడికి గురై తన పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నానని, నాణ్యమైన విద్య అందించలేకపోతున్నా నని ఆవేదనతో ఈ నెల 22న ఆత్మాహత్యాయత్నం చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురై తీసుకున్న నిర్ణయం కంటే.. ఆ నిర్ణయానికి దారితీసిన వ్యవస్థలోని ఒత్తిడిని గుర్తించడం ముఖ్యం. విద్యార్థుల సంఖ్య, తరగతుల సంఖ్య, బోధనా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులు ఉండాలి.
విద్యార్థులు పెరిగిన పాఠశాలకు టీచర్లను పెంచకుండా.. ఉన్న వారితోనే నడపాలని ఆశించడం వల్ల చివరకు నష్టపోయేది ఎవరు? విద్యార్థులే. ఉపాధ్యాయుడి ఆ బోధనకు అవసరమైన సమయం, ప్రశాంతమైన వాతావరణం కల్పించకుండా నాణ్యమైన విద్యను ఆశించడం ఎలా సాధ్యం? ఈ అంశాన్ని ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు
ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఐదు తరగతులు ఉన్నచోట కనీసం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలి. విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను నియమించాలి. ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించాలి. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగాలంటే ముందుగా తరగతి గదిలో నాణ్యమైన బోధన జరగాలి.
అందుకు ఉపాధ్యాయుడు పాఠశాలలోవిద్యార్థులతో ఉండాలి. అలాకాకుండా ఉపాధ్యాయుడిని నివేదికల తయారీదారుగా, రికార్డుల నిర్వహణాధికారిగా, వివిధ కార్యక్రమాల నిర్వాహకుడిగా మార్చేస్తే బోధనకు సమయం ఎప్పుడు మిగులుతుంది? టీచర్లపై ఒత్తిడి తగ్గితేనే.. తరగతి గదిలో బోధన పెరుగుతుంది. విద్యార్థుల అభ్యసనా మెరుగవుతుంది. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం మరింత బలపడుతుంది. ఇదే విద్యార్థుల ప్రయోజనానికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన మార్గం.
వ్యాసకర్త: రాష్ట్ర
గౌరవాధ్యక్షుడు, టీఆర్టీఎఫ్:
9848481028