సింగపూర్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నారై యువత రక్తదానం
కొడిమ్యాల,సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): సింగపూర్ దేశంలో నివసిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎన్నారై(NRI) యువకులు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమానికి స్పందిస్తూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షుడు వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రక్తదాన కార్యక్రమానికి మద్దతుగా సింగపూర్‌లోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సుమారు 25 మంది ఎన్నారై యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా బైరి రవి మాట్లాడుతూ... వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే 2,850 మందికి పైగా శ్రీనివాసులు రక్తదానం చేయడం అభినందనీయమని,ఈ సేవా కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలుస్తూ సింగపూర్‌లో ఉన్న తమ మిత్రులు కూడా రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావాలని బైరి రవి పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బైరి రవి, పి.శేఖర్, కె.రమ్జాన్, కె.శ్యామ్, కె.ప్రశాంత్, ఎన్.శ్రీనివాస్,అనిల్, వెంకటేష్,ప్రవీణ్, యు.స్వామి, గంగాధర్, నరసన్న,నవీన్, రాంసుందర్,రాజ్ కుమార్, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొని రక్తదానం చేశారు.