రాజకీయ అసహనం!

10-09-2026 | 05:05am

ప్రజాస్వామ్యం(Democracy)లో పాలక, ప్రతిపక్షాల(Ruling and opposition parties) మధ్య రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలు విమర్శించడం, నిరసనలు చేపట్టడం, విపక్షాల ఆరోపణలను పాలకపక్షం తిప్పికొట్టడం సర్వసాధారణం. అయితే, ఆ నిరసనలు హద్దులు దాటి అసభ్య పదజాలానికి, వ్యక్తిత్వ హననానికి దారితీయడం ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాలరాయడమే అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) అభ్యంతరకరమైన ఇలాంటి ధోరణి పెరుగుతుండటం ఆందోళనకరం.

ముఖ్యంగా చట్టసభను నడిపించే సభాపతిని, అందులోనూ అత్యున్నతమైన రాజ్యాంగ పదవి(Constitutional post)లో ఉన్న ఓ దళిత నేతను అవమానకరమైన రీతిలో సంబోధించడాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress National President Mallikarjun Kharge) పాల్గొన్న సభావేదికను శుద్ధి చేసిన ఘటనను మరువకముందే, మన రాష్ట్రంలోనూ దళితులు నడిచిన దారిని శుద్ధి చేసిన ఘటన వెలుగులోకి రావడం తీవ్ర అభ్యంతరకరం.

ఈ ఘటన ఒక వ్యక్తిని లేదా ఒక వర్గాన్ని అవమానించడమే కాదు, సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న కులాధిపత్య భావజాలానికి, కుల అహంభావానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయవచ్చు. విధానాలపై విమర్శలు చేయవచ్చు. కానీ, వ్యక్తిగతంగా నిందించడం, ఒక సామాజికవర్గాన్ని కించపరచాలనుకోవడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులే ఇలాంటి దురాచారాలకు పాల్పడటం దురదృష్టకరమనే చెప్పాలి. కాగా, నిరసనల పేరిట దిష్టిబొమ్మలు దహనం చేయడం, పిండప్రదానాలు చేయడం వంటి చర్యలు రాజకీయ సంస్కృతిని దిగజార్చేవే అని చెప్పక తప్పదు. అదే సమయంలో ఒక నాయకుని చావును కోరడాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేం. రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆయన మరణించాలని కోరుకునే స్థాయికి రాజకీయ విభేదాలు దిగజారడం విచారకరం.

ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా ఉండాలి. రాజకీయాలు విలువలను కోల్పోతే సమాజానికి తీరని నష్టం జరుగుతుంది. రాజకీయాల్లో అసహనం శ్రుతిమించుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సంస్కృతికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయ నేతలు ఇప్పటికైనా గుర్తెరగాలి.

మరిన్ని వార్తలు