రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
సంస్థాన్ నారాయణపూర్,అక్టోబర్ 04(విజయ క్రాంతి): రాచకొండ దసరా ఉత్సవాల సమితి(Rachakonda Dasara Celebrations Committee), ఇఎల్వి భాస్కర్ ఫౌండేషన్(ELV Bhaskar Foundation) సంయుక్తంగా నిర్వహించబోయే రాచకొండ దసరా ఉత్సవాల కరపత్రికను ఆదివారం రాచకొండలోని రామాలయం వద్ద ఇఎల్వి భాస్కర్ ఫౌండేషన్ అధినేత ఇరుగుదిండ్ల భాస్కర్(Irugudindla Bhaskar) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ అక్టోబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో సినీ జానపద కళాకారులచే ఆటపాటలు,బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని,అక్టోబర్ 22వ తేదీన దసరా సంబరాలను ఘట్టుప్పల మండలంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా దసరా ఉత్సవాలను నిర్వహించబోతున్నామని అన్నారు.రాచకొండను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడమే తన అంతిమ లక్ష్యమని భాస్కర్ అన్నారు.హైదరాబాదుకు కూత వేటు దూరంలో ఉండే రాచకొండను అభివృద్ధి చేసుకోవడం ద్వారా సమీపంలోని గ్రామాలు అభివృద్ధి చెంది ఈప్రాంత ప్రజలు ఉపాధి పొందగలుగుతారని అన్నారు.రాచకొండలోని ప్రాచీన దేవాలయాల పునర్నిర్మాణానికి తన కృషి ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రచప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్,అల్లపురం సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి,వివిధ గ్రామాల ప్రజలు, ఇఎల్వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.