మానవత్వం చాటిన సూర్యాపేట కౌన్సిలర్లు

04-10-2026 | 09:12pm

* తోటి సభ్యురాలి కుటుంబానికి నెల జీతం విరాళం

* పార్టీలకతీతంగా ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు

* చెంచల శ్రీనివాస్ కుటుంబానికి రెండు లక్షల నలభై వేల రూపాయల ఆర్థిక సాయం

సూర్యాపేట, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మానవత్వానికి రాజకీయాలు అడ్డురావని సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లు(Suryapet Municipal Councilors) చాటిచెప్పారు. తోటి ప్రజాప్రతినిధి కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలవడమే తమ బాధ్యత అన్నట్లుగా పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన 20 వ వార్డు కౌన్సిలర్ చెంచల మణిలత భర్త, మాజీ కౌన్సిలర్ చెంచల శ్రీనివాస్ కుటుంబానికి తమ ఒక నెల గౌరవ వేతనాన్ని ఆర్థిక సహాయంగా అందజేశారు.

స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాల ఫంక్షన్ హాల్‌లో ఆదివారం చెంచల శ్రీనివాస్ సంస్మరణ సభ నిర్వహించగా, అధికార మరియు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లందరూ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అండగా నిలవాలని నిర్ణయించిన కౌన్సిలర్లు.. తమకు ప్రభుత్వం నుంచి అందే ఒక నెల గౌరవ వేతనాన్ని కుటుంబానికి అందజేయాలని నిర్ణయించి, ఆ విధంగా సేకరించిన రెండు లక్షల నలభై వేల రూపాయలను కౌన్సిలర్ చెంచల మణిలత మరియు ఆమె కుమారుడు చెంచల నిఖిల్ నాయుడుకు అందజేశారు.

భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. పార్టీల భేదాలను పక్కనపెట్టి తోటి కౌన్సిలర్ కుటుంబానికి ప్రజాప్రతినిధులంతా అండగా నిలవడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ప్రదర్శించిన ఐక్యత మరియు మానవత్వం స్థానికంగా ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్మి, వైస్ చైర్మన్ మహమ్మద్ షఫీ ఉల్లా, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నాగార్జున అంగిరేకుల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు