విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు!
- నిబంధనలు గాలికి వదిలేస్తున్న నిర్మాణదారులు
- నాలా పక్కనే భవన నిర్మాణాలు
- ఫిర్యాదు వస్తేనే నోటీసులు జారీ, నోటీసుల పేరుతో వసూళ్లు
- మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు అడ్డుకునేదెవ్వరు?
మల్కాజిగిరి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని అనేక కాలనీలలో అక్రమ నిర్మాణాలు ఊపందు కున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నా ఇక్కడ పట్టించుకునే నాధుడే లేడు. ముఖ్యంగా మల్కాజ్గిరి, నేరేడ్మెట్, గౌతమ్ నగర్, వినాయక నగర్ డివిజన్ ల లో అక్రమ కట్టడాలు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి.
ఓ కాలనీలో నాలా పక్కనే బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి కారణం చైన్ మేన్ అండ దండలతో ఈ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బహిరంగ ఆరోపణలు వినవస్తున్నాయి.
కూలుతున్నా.. భయమేది?
గచ్చిబౌలి అంజయ్య నగర్ లో ఇటీవల అక్రమ నిర్మాణం కూలిపోయిన విషయం తెలిసిందే. అయినా, ఎలాంటి భయం లేకుండా మల్కాజిగిరిలో అక్రమ నిర్మాణాలు పెద్దస్థాయిలో వెలుస్తున్నాయి. వీటికి స్థానిక చైన్ మెన్ , టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
అక్రమ నిర్మాణాలు ఈ అధికారుల కనుసన్నుల్లోనే విచ్చల విడిగా కొనసాగుతు న్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని ఆరంభం లోనే నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు, నిర్మాణదారులతో కుమ్మక్కై తమ జేబులు నింపు కుంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని పలువురు బహిరంగంగానే విమర్శి స్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు తుంగలో తొక్కి..
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను అడ్డుకట్ట వేయాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా మల్కాజిగిరిలో మాత్రం సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదన్న విమర్శలు వినబడుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులు పలుమార్లు మొట్టికాయలు చేస్తున్న, మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో అనుమతి లేని భవన నిర్మాణాలను అధికారులే ప్రోత్సాహాకాలు అందిస్తూ, నిర్మాణ దారులతో బేరసారాలా డుతూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారని స్థానికంగా విమర్శిస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు..
కొన్ని నిర్మాణాలకు అనుమతి లేవు. మరి కొన్నింటికి పాత భవనాలపై అనుమతి తీసుకుని బహుళ అంతస్థులు , కమర్షియల్ షాప్ లు, పెంట్ హౌజ్ లు నిర్మిస్తున్నారు.అనుమతి ఉన్న దాని కంటే అదనపు అంతస్తులతో ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జి + 5 భారీ అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు. దీనిపైన ఓ పెంట్ హౌజ్ నిర్మిస్తున్నారు.
అదే విధంగా పలు కాలనీలో జి + 2 అనుమతి తీసుకున్నా కొందరు అక్రమార్కులు, నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి భద్రతా ప్రమాణా లు పాటించకుండా యథేచ్ఛగా మొదలు పెట్టి అధికారులకు తెలియ కుండా నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. సర్కిల్ పరిధిలోని నాలా పక్కనే అనుమతి ఇవ్వడం లేదని జిహెచ్ ఎంసి అధికారులు బహిరంగంగా ప్రకటించినా.. ఇప్పటికే పదుల సంఖ్యలో నిర్మాణాలు పూర్తయిన భవనాలు ఉన్నాయి.
ఓ కాలనీలో ఎలాంటి సెట్ బ్యాక్స్, డివియేషన్స్ పాటించ కుండా వదలకుండా జి + 4 అంతస్థుల భారీ అక్రమ నిర్మాణ భవనాలను చేపడుతున్నారు. ఇది టౌన్ ప్లానింగ్, టిపిఎస్, ఏసీపీ, సిబ్బంది పక్క స్కెచ్ తో నిర్మాణదారుల నుంచి అమ్యామ్యాల తీసుకోవడం వల్లే ఇలాంటి అక్రమ నిర్మా ణాలను చేపడుతున్నారని స్ధానికుల నుంచి తీవ్రంగా విమర్శలు వెల్లువెతున్నా యి. అనుమతులు లేని బహుళ అంతస్తుల నిర్మా ణాలు, కమర్షియల్ షెడ్ల నిర్మాణాలు వెలుస్తున్నాయి.
నిర్మాణ దారులతో కాసుల బేరం కుదరకుంటే ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా.. ఆగమేఘాల మీద వాలి చిన్నపాటి పిట్ట గోడలు కూల్చివేసి, ఆ తదుపరి నిర్మాణదారుల వద్ద నుంచి అందినంత దండుకుని అధికారులు, అక్రమ నిర్మాణదారులను ప్రొత్సహిస్తున్నారని స్ధానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై పత్రికలలో వార్తకధనాలు వెలువడినప్పుడు మాత్రమే అధికారులు, తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తుంటారని, ఆ నోటీసుల పేరుతో నిర్మాణదారుల నుంచి లక్షలలో వసూళ్ల చేసి తమ జేబులు నింపుతూ అధికారులు తమ పబ్బం గడుపు తున్నారని మల్కాజిగిరిలో ఆరోపణలు వినపడు తున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం..
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై కొందరికి నోటీసులు జారీ చేశాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. అనుమతులు లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
జాకియ సుల్తానా బేగం, డిప్యూటీ కమిషనర్
