3 September, 2026 | 10:20 PM

అతివలకు అండగా షీ టీం

03-09-2026 | 09:48pm

-  ఆగస్టు నెలలో 136 ఫిర్యాదులకు స్పందన 

- 5 ఎఫ్ఐఆర్‌లు, 117 ఈ-పెట్టి కేసులు

- 163 హాట్‌స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు

- ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) వ్యాప్తంగా మహిళలు, విద్యార్థినుల భద్రతకు షీటీం బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) అన్నారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అక్క, షీ టీం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆగస్టు నెలకు సంబంధించిన షీ టీం నెలవారీ నివేదికను విడుదల చేసి పలు సూచనలు చేశారు. మహిళలు, విద్యార్థినుల భద్రత, సైబర్ నేరాలు(Cybercrimes), మహిళలపై వేధింపులు, బాల్యవివాహాల నివారణ తదితర అంశాలపై జిల్లా వ్యాప్తంగా 48 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు సోషల్ మీడియా వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారన్నారు.

ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా షీ టీం బృందాలకు 136 ఫిర్యాదులు అందగా, వాటిపై తక్షణమే స్పందించి బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారన్నారు. 117 ఈ-పెట్టి కేసులు, 5 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయడంతో పాటు 14 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. మహిళలు, విద్యార్థినులకు ఇబ్బందులు కలిగించే ఆకతాయిలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా 163 హాట్‌స్పాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మహిళలు, విద్యార్థినుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.

బాల్య వివాహాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన షీ టీం బృందాలు ఆగస్టు నెలలో రెండు బాల్య వివాహాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించాయని, బాల్యవివాహాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలను ఎక్కువగా సందర్శిస్తూ విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని, వేధింపులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు, విద్యార్థినులకు అండగా షీ టీం బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, అత్యవసర పరిస్థితుల్లో షీటీం నెంబర్ (8712659953) లేదా డయల్ 100/112కు సంప్రదించాలని సూచించారు.

అనంతరం షీ టీం సభ్యులు, పోలీస్ అక్కల పనితీరును సమీక్షించిన ఎస్పీ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఎస్బిఐ డీఎస్పీ ఎం వెంకట నరసయ్య, పట్టణ సిఐలు, షి టీం బృంద సభ్యులు సుశీల, రోహిణి, లావణ్య, మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.