కడుపుకోతతో కాసుల పంట!
- అమాయకుల భయమే ప్రైవేట్ ఆస్పత్రుల పెట్టుబడి
- తొలి కాన్పులోనే తొందరపాటు
- ఉమ్మనీరు, పేగు మెడకు చుట్టుకుందని భయపెట్టి అవసరం లేని ఆపరేషన్లు
- ఒక్కో ఆపరేషన్‌కు రూ.లక్షల్లో వసూళ్లు
- పట్టించుకోని వైద్యారోగ్యశాఖ
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): బిడ్డకు జన్మనివ్వబోయే తల్లి ఆరోగ్యం కంటే డబ్బే లక్ష్యంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు (Private hospitals) అవసరం లేక పోయినా భయపెట్టి సి సెక్షన్ (ఆపరేషన్లు) చేస్తున్నారనే ఆరోపణలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ బిడ్డ ఉమ్మనీరు మింగింది అంటూ బిడ్డ మెడకు పేగు చుట్టుకుందని, బిపి హై ఉందంటూ బిడ్డకు జన్మనిచ్చే తల్లితో పాటు వారి బంధువులను కూడా భయభ్రాంతులకు గురిచేసి మొదటి కాన్పులోనే సి సెక్షన్ చేస్తున్నారు.
ఇతర గైనకాలజీ వైద్యుడితో పాటు ప్రభుత్వ నిబంధనలను మేరకు మాత్రమే సిజేరియన్ కాన్పు చేయాలని ఉన్నా అవేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రైవేటు ఆసుపత్రులు దందాకు పాల్పడుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన ప్రసవాల సంఖ్యను పరిశీలిస్తే ఈ దోపిడీ వ్యవహారంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల హస్తం కూడా దాగి ఉందనే అనుమానాలున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పేరుతో డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఆ డబ్బంతా కాన్పు కోసమే ఖర్చవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు వైద్యులే అయినప్పటికీ పేద రోగుల నుండి అడ్డగోలుగా దోచుకుంటున్న ఆస్పత్రులపై మమకారం చూపడంలొ అలసత్వమా చేతగానితనమో అర్ధం కానీ పరిస్థితి.
ప్రైవేట్లో ఆపరేషన్లదే పైచేయి
జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రసవాల సంఖ్యను పరిశీలిస్తే సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్ ప్రసవాలు భారీగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2023-24లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 656 సాధారణ ప్రసవాలు నమోదు కాగా, 2,384 సిజేరియన్లు జరిగాయి. అంటే సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. 2024-25లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది.
1,512 సాధారణ ప్రసవాలకు 5,248 సిజేరియన్లు నమోదయ్యాయి. 2025-26లో 765 సాధారణ ప్రసవాలు, 2,620 సిజేరియన్లు నమోదయ్యాయి. 2026-27లో ఇప్పటివరకు 256 సాధారణ ప్రసవాలకు 905 సిజేరియన్లు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవానికి 30వేలు, సిజేరియన్లకి లక్ష నుండి 1,50 వరకు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి దాపురించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో భిన్నమైన పరిస్థితి
ప్రభుత్వ ఆసుపత్రుల లెక్కలను పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2023-24లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,465 సాధారణ ప్రసవాలు, 4,301 సిజేరియన్లు జరిగాయి. 2024-25లో 8,125 సాధారణ ప్రసవాలు, 7,198 ఆపరేషన్లు నమోదయ్యాయి. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ల శాతం ఎందుకు ఇంత అధికంగా నమోదవుతున్నాయానే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి.
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ
అమ్మతనం కోసం ప్రతి మహిళ ఎంతగానో ఆతృతపడుతుంది. ప్రసవ వేదనతో తల్లడిల్లుతూ వైద్యుడిపై పూర్తి నమ్మకంతో ఆసుపత్రికి వెళితే డబ్బు సంపాదనే లక్ష్యంగా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.
ఆసుపత్రుల రిజిస్టర్లు, కేస్షీట్లు, ఆపరేషన్ నోట్స్, రోగుల సమ్మతి, అల్ట్రాసౌండ్, డిశ్చార్జ్ వంటి వాటిని పరిశీలిస్తే సిజేరియన్ అవసరం ఉందా లేదా అనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రులపై తరచూ తనిఖీలు జరపాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.