రాజీనామా చెయ్
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం అవమానం
- ప్రతిపక్ష హోదాకు న్యాయం చేయలేకపోతే పదవిలో ఎందుకు?
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్
- అసెంబ్లీకి రండి.. సూచనలివ్వండి
- తీరు మార్చుకోకుంటే మరో పదేళ్లు రోడ్డుపైనే: మంత్రి శ్రీధర్‌బాబు
- కేసీఆర్ రాజీనామా డిమాండ్‌తో ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా
- ప్రభుత్వ సలహాదారు వీహెచ్, మంత్రులు అజారుద్దీన్, పొన్నం హాజరు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రతి పక్ష నేత హోదాకు న్యాయం చేయాలని, సభకు రాలేకపోతే పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ (TPCC President Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు. ప్రజాపా లన ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే కేసీ ఆర్ అసెంబ్లీకి (Assembly) దూరంగా ఉంటున్నారని, ఫామ్‌హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు.
కేసీఆర్ రాజీనా మా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభు త్వ సలహాదారు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రె స్ శ్రేణులు ఆదివారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేశారు. ఈ సందర్భం గా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. అధికారం ప్రజలు ఇచ్చే కానుక అని, పదవులు శాశ్వతం కాదన్న స్పృహతో మా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు సన్న బియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉడ్యోగాలు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే 70 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా రెండేళ్లలో రూ. 1.78 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించామని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏకంగా రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టేలా కృషి చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఉద్యమకారులు గద్దర్, అందే శ్రీలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గద్దర్ పేరిట ప్రత్యేక అవార్డులు ఇవ్వడంతో పాటు, మహాత్మా జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించి, వారికి తగిన గౌరవం దక్కేలా చేశామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో వైద్య రంగం పూర్తిగా కార్పొరేట్ సెక్టార్ చేతికి వెళ్లిందని ఆరోపించారు. కేటీఆర్ చదువు గురించి మాట్లాడటం బాగానే ఉందని, అయితే కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఆయనకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతినెలా జీతం తీసుకుంటూ, ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రాకపోవడం ప్రతిపక్ష నేత హోదాని అపహాస్యం చేయడమేనని మహేశ్‌కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.
బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు తప్పులను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకుంటామని.. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది ధీమా వ్యక్తం చేశారు.
మార్పుకోసమే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు : మంత్రి శ్రీధర్‌బాబు
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు.. మార్పు కోరుకుని 2023లో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన అనుభవాలతో ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నారు. ప్రభుత్వంపై లేవనెత్తిన అంశాలకు దీటుగా జవాబు ఇస్తామని స్పష్టం చేశారు. వెయ్యి రోజుల పాలనలో ఎన్నో చేశాం, ఇంకా చెయ్యాల్సినవి మరెన్నో ఉన్నాయి, రానున్న రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని, ప్రయాణించే వారిలో వాళ్లు లేరా? అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ ఇస్తూ రాష్ట్రాన్ని ముందకు నడిపిస్తున్నామని తెలిపారు. తీరు మార్చుకోకున్నా, మీ నాయకత్వం సరిగా లేకున్నా మరో పదేళ్లు రోడ్డుపైనే కూర్చోపెడుతాం అని హెచ్చరించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, నిరుపేదల పక్షాన తాము ధర్నాలు కూడా చేశామని మంత్రి గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజలకు ఏం చేశాయని ధర్నాలు చేస్తున్నాయని, ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేస్తుందన్నారు. ‘కేటీఆర్, హరీశ్‌రావు.. ఇప్పుడు మీరు ఎత్తుకున్న అంశాలపై నాడు కేసీఆర్‌ను ఎందుకు అడగలేదు’ అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. సన్న బియ్యం ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా? ఇది మార్పు కాదా? అని ప్రశ్నించారు. రైతులకు 1 లక్ష 60 వేల కోట్లు పైగా ఖర్చు చేశాం, ఆరు గ్యారంటీల అమలు దిశగా ముందుకెళ్తున్నాం, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం, మీరు చేయలేని పనులను మేము చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో బీఆర్‌ఎస్ విఫలమైందని, నిరుద్యోగ యువతను మోసం చేసింది మీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ‘రైతుబంద్ ఇచ్చి అన్నీ బంద్ పెట్టారు. ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటీ సరిగా అమలు చేయలేదు. డబుల్ 420 బీఆర్‌ఎస్ పార్టీ కాదా?. మేము చేస్తే ఓరుస్తలేరు’ అని మంత్రి మండిపడ్డారు. ‘సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. కేసీఆర్ ఏం చెప్పినా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. ధర్నాలో మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.






