మంథనిలో రైతు గోస
ప్రభుత్వం హామీ ఇచ్చిన 24 గంటల కరెంటు ఏమైంది
బిజెపి భరోసా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ప్రస్తుతం కేవలం కొన్ని గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, రైతులు మంథనిలో ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర పార్టీ(BJP party) పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమం(Rythu Gosa BJP Bharosa Program)లో భాగంగా శనివారం మంథని అంబేద్కర్ చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు 7 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సొంత నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సునీల్ రెడ్డి విమర్శించారు.
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. రైతులకు వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం బీజేపీ నాయకులు, రైతులు మంథని విద్యుత్ డీఈని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొండపక సత్యప్రకాష్, బిజెపి రాష్ట్ర నాయకుడు చల్ల నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, నియోజకవర్గ కో-కన్వీనర్ నంపెళ్లి రమేష్, మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, సబ్బాని సంతోష్, కొయ్యడ సతీష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్కా సదానందం, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, మట్ట శంకర్, మళ్లారపు అరుణ్, చిలువేరు సతీష్, విశ్వాతేజ, సామల అశోక్, భానుప్రకాశ్, తొట్ల రాజు తదితర బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.