పర్యాటక కేంద్రాల్లో కళాకారులకు ఉపాధి
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల సమావేశాలు(Telangana Monsoon Session) ఆరో రోజు కొనసాగుతున్నాయి. శాసన మండలిలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) మాట్లాడుతూ... 8500 మంది కళాకారులకు గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు తెలిపారు. కళాకారులకు రూ. 3500 చొప్పున పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. గద్దర్ ఫౌండేషన్ కింద రూ. 3 కోట్లు కేటాయించామన్న మంత్రి జూపల్లి వృద్ధ కళాకారులకు ప్రతినెలా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. పద్మశ్రీ గ్రహీతలకు రూ .25 లక్షల చొప్పున ఇచ్చామని తెలిపారు. వాళ్లకు నెలకు రూ. 25 వేల చొప్పున పింఛన్ ఇస్తున్నామని వెల్లడించారు.
జానపద కళాకారుల సేవల వినియోగంపై యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. కళాకారుల నైపుణ్యాలు(Artisans' Skill) పెంచడానికి చర్యలు చేపట్టమన్నారు. పర్యాటక కేంద్రాల్లో వేదికలు ఏర్పాటు చేసి కళాకారులకు ఉపాధి కల్పిస్తామన్నారు. పర్యాటకులకు వినోదం కల్పించేందుకు కళారూపాలను ప్రదర్శిస్తామన్నారు. సాంస్కృతిక శాఖ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రభాత భేరి కార్యక్రమం చేపట్టామన్నారు. గంజాయి, మద్యం పారద్రోలేందుకు కళాకారుల ద్వారా ప్రదర్శనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమాజంలో అసమానతలపై చైతన్యపరుస్తామని సూచించారు.