నేపాల్ మృతులు 1,451

21-09-2026 | 05:10am
  1. ఇంకా 6,000 మందికి పైగా గల్లంతు
  2. కొనసాగుతున్న గాలింపు చర్యలు
  3.   13,784 మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు

కాఠ్మండు, సెప్టెంబర్ 20: గత నెలలో నేపాల్‌(Nepal)ను అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదల(Flash floods) వల్ల మృతిచెందిన వారి సంఖ్య ఆదివారానికి 1,450 దాటింది. ఈ విపత్తు తదనంతర ప్రభావాల నుంచి ఆ హిమాలయ దేశం(Himalayan country) ఇంకా కోలుకుంటోంది. ప్రభావిత ప్రాంతాల నుంచి మరికొన్ని మృతదేహాలను వెలికితీయడంతో, ఆగస్టు 26 నాటి ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1,451కి చేరినట్లు నేపాల్ పోలీసులు(Nepal Police) ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్--టిబెట్ సరిహద్దు(Tibet border) సమీపంలో మొదలైన ఈ వరదలు, ఉత్తర, మధ్య నేపాల్‌లోని పట్టణాలు, గ్రామాలను సర్వనాశనం చేశాయి. 

హిమాలయ సరిహద్దు ప్రాంతం నుంచి దక్షిణ దిశగా ప్రవహించే భోటెకోషి నది వరద నీటిని దిగువకు తీసుకువెళ్లి, ఇళ్లు, వాహనాలు, రోడ్లు, వంతెనలను నామరూపాలు లేకుండా చేసింది. దీంతోపాటు జలవిద్యుత్ ప్రాజెక్టులను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. చైనా మీడియా కథనాల ప్రకారం.. ఈ వరదల వల్ల చైనా వైపు కూడా 43 మంది మరణించగా, 500 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్‌లోని చిత్వాన్ జిల్లాలో 367 మృతదేహాలు, రసువాలో 236, తూర్పు నవల్పరాసిలో 232, పశ్చిమ నవల్పరాసిలో 222 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అలాగే, నువాకోట్‌లో 203, గోర్ఖాలో 79, ధాడింగ్‌లో 72, తనహులో 38 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాఠ్మండు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ఇద్దరు వరద బాధితులు కూడా మరణించారు. అయితే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వరద బారిన పడిన 13,784 మందిని రక్షించారు. వరదల తర్వాత సుమారు 6,000 మంది ఇంకా గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు అంచనా వేస్తున్నారు.

రసువా, పొరుగు జిల్లాల్లోని నదీ తీరాలు, శిథిలాలు పేరుకుపోయిన ప్రాంతాలు, దెబ్బతిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వెలికితీసిన మొత్తం మృతదేహాలలో సుమారు 110 మాత్రమే గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక కుటుంబాలకు అప్పగించామని అధికారులు తెలిపారు. డీఎన్‌ఏ నమూనాలను సేకరించిన తర్వాత, ఇప్పటివరకు దాదాపు 1,300 మృతదేహాలను తాత్కాలికంగా ఖననం చేశామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు