లౌకిక సామాజిక న్యాయ విజయ కూటమి
- తమిళనాడులో టీవీకే నేతృత్వంలోని కూటమి పేరు ఇదే..
- ఎస్‌ఎస్‌జేవీఎఫ్ నాయకుడిగా విజయ్ ఏకగ్రీవం
- కొత్త జట్టులో చేరని వామపక్ష పార్టీలు
చెన్నై, సెప్టెంబర్ 9: తమిళనాడు(Tamil Nadu)లో అధికారంలో ఉన్న టీవీకే పార్టీ(TVK Party)తో కలిసి ఇప్పటిదాకా మద్దతిచ్చిన పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. టీవీకే నేతృత్వంలోని ఈ సరికొత్త జట్టుకు ‘లౌకిక సామాజిక న్యాయ విజయ కూటమి(సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్(ఎస్‌ఎస్‌జేవీఎఫ్))(Secular Social Justice Victory Front) అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్(C Joseph Vijay)ని ఏకగ్రీవంగా కూటమి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ నయా ఫ్రంట్‌లో వామపక్ష పార్టీలు చేరలేదు. బుధవారం సీఎం విజయ్ నేతృత్వంలో మిత్రపక్షాలన్నీ సమావేశమై కూటిమిగా ఏర్పడ్డాయి.
ఈ సమావేశంలో, రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాలకు అక్టోబర్ 6న జరగనున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడంపై కూడా చర్చించారు. అధికార టీవీకే పార్టీకి ఇది మొదటి కీలక పరీక్ష కానుంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టీవీకే సీనియర్ నాయకుడు, ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున, తమ పార్టీ నేతృత్వంలోని కూటమి ఖరారైందని, ఇది కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాదని పేర్కొన్నారు.
సంస్కరణ ఉద్యమకారులైన పెరియార్ ఈవీ రామసామి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ద్రావిడ ఉద్యమ నేత సీఎన్ అన్నాదురై ఆశయాలకు అనుగుణంగా, ప్రజల కోసం ఏర్పడిన సిద్ధాంతపరమైన కూటమి ఇది అని ఆయన స్పష్టం చేశారు. ‘లౌకికవాదం, సామాజిక న్యాయం ఎక్కడ ఉంటాయో, అక్కడ విజయం ఖాయం. ఇది ప్రజల కోసం ఉద్దేశించిన కూటమి’ అని అర్జున వెల్లడించారు. వామపక్ష పార్టీలు ఈ కూటమిలో చేరకపోవడంపై స్పందిస్తూ, ‘వామపక్ష పార్టీల పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది’ అని అన్నారు.
అంతేకాకుండా వామపక్ష పార్టీల మనసు ఎప్పటికీ ఈ కూటమితోనే ఉంటుందని, వారు టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతునిస్తూనే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కేవలం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా లౌకికవాదాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని వీసీకే అధినేత తిరుమావళవన్ అన్నారు. ఈ అవగాహనతోనే కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, ఎండీఎంకే పార్టీలు ఏకగ్రీవంగా ఈ కూటమిని ఏర్పాటు చేశాయని ఆయన పేర్కొన్నారు.
మధురాంతకం, ధరాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటిస్తామని, కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని టీఎన్‌సీసీ అధ్యక్షుడు బీ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఇదే మొదటిసారి కాబట్టి ఒక ‘కొత్త చరిత్ర‘ సృష్టించబడిందని ఐయూఎంఎల్ అగ్రనేత ఖాదర్ మొహిదీన్ పేర్కొన్నారు.