థర్మల్ కరెంట్ కు షాక్

24-09-2026 | 05:40am

సింగరేణితో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫుట్ బాల్ ఆట’! 

బొగ్గు కొరత.. ప్లాంట్ల మూత.. రైతులకు కరెంట్ కష్టాలు 

జెన్కోకు సింగరేణి నాసిరకం బొగ్గు.. రూ. 2,900 కోట్ల నష్టం 

సింగరేణికి రూ.52 వేల కోట్ల బకాయిలు 

నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు నేడు ఆరు బీఆర్‌ఎస్ బృందాల క్షేత్రస్థాయి పరిశీలన 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యుత్ సంక్షో భం నెలకొనడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం, విద్యుత్ రంగం(Power Sector)లో మిస్‌మేనేజ్‌మెంట్, సింగరేణి-జెన్కో(Singareni-Genco) మధ్య ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది.. అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. ఎన్నికల సమయంలో తాము చేసిన హెచ్చరికలే ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత(Coal shortage)తో ఉత్పత్తి పడిపోతున్నదని, మరోవైపు జల విద్యుత్ కేంద్రాలు(Hydroelectric power stations) కూడా నీటి లభ్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులపై వాస్తవాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గురువారం ఆరు బీఆర్‌ఎస్ బృందాలు రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లు(Thermal power plants), సింగరేణి ప్రధా న కార్యాలయాన్ని సందర్శించనున్నాయని వెల్లడించారు. తెలంగాణ భవ న్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులకు ఆరు గంటలకు మించి కరెంట్ సరఫరా కావడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్ కోతల ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కావడం లేదని, పరిశ్రమలు కూడా ప్రత్యామ్నాయ విద్యుత్ వనరులపై ఆధారపడుతున్నాయని చెప్పారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు తమ విద్యుత్ అవసరాల్లో సుమారు 30 శాతం వరకు జనరేటర్ల ద్వారా సమకూర్చుకుంటున్నామని చెప్పినట్టు తెలిపారు. దీనివల్ల పరిశ్రమల నిర్వహణ వ్యయం పెరిగే పరిస్థితి ఏర్పడుతున్నదని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు కరెంట్ విలాస వస్తువు కాదని, జీవనరేఖ అని అన్నారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, ఐటీ రంగం, గృహ అవసరాలు అన్నింటికీ విద్యుత్ అత్యంత కీలకమని చెప్పారు. విద్యుత్ సమస్యపైనే తెలంగాణ మలి దశ ఉద్యమానికి పునాది పడిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉండగా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో దాన్ని 19,472 మెగావాట్లకు పెంచామని తెలిపారు.

విద్యుత్ రంగంలో దాదాపు రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్పారు. 400 కేవీ సబ్‌స్టేషన్లను 6 నుంచి 28కు, 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 103కు పెంచినట్టు వివరించారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని పేర్కొన్నారు. అప్పట్లో దేశంలోనే అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించిన విద్యుత్ కేంద్రాల్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఒకటని చెప్పారు. సింగరేణి విద్యుత్ కేంద్రం సుమారు 91 శాతం పీఎల్‌ఎఫ్‌తో పనిచేసిందని తెలిపారు. ప్రస్తుతం అదే సంస్థ, అదే విద్యుత్ వ్యవస్థ ఇబ్బందుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.

ఆరు గంటలకే పరిమితమం..

సోషల్ మీడియాలో ‘80స్ ట్రెండ్’ నడుస్తున్న సమయంలో తెలంగాణలో మాత్రం 1980ల నాటి విద్యుత్ పరిస్థితులు తిరిగి వచ్చాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అప్పట్లో రైతులు విద్యుత్ కోసం పడిన ఇబ్బందులు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి, క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆరోపించారు. రానున్న వేసవిలో పరిస్థితి మరింత తీవ్రమైతే తాగునీరు, యాసంగి పంటలు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం ఏం ప్రణాళికతో ముందుకెళ్తున్నదో చెప్పాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఉత్పత్తి కేంద్రాలు వరుసగా నిలిచిపోవడంపై కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో సుమారు 400 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 270 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్ నిలిచిపోయిందన్నారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండగా.. సుమారు 544 మెగావాట్ల స్థాయిలోనే ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలోని పలు థర్మల్ యూనిట్లలో బొగ్గు కొరతతో ఉత్పత్తి ప్రభావితమైందని ఆరోపించారు. 

‘ఎల్ నినో కాదు.. ఎల్ కాంగో’..

విద్యుత్ సంక్షోభానికి ఎల్ నినో ప్రభావమే కారణమన్న వివరణను కేటీఆర్ తిరస్కరించారు. ‘ఇది ఎల్‌నినో కాదు.. ఎల్ కాంగో’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే, ‘తాజా విద్యుత్ పరిస్థితిపై వచ్చిన ఇతర నివేదికలు ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, పెరిగిన ఉష్ణోగ్రతలు, రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్, తక్కువ జల విద్యుత్ ఉత్పత్తి కూడా వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నట్టు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో సింగరేణి ఒడిశాలోని నైనీ గనుల నుంచి యాదాద్రికి బొగ్గు సరఫరాను పెంచే చర్యలు చేపట్టినట్టు తాజా సమాచారం వెల్లడిస్తోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 2,100 టన్నులుగా ఉన్న సరఫరాను 10 వేల నుంచి 14 వేల టన్నులకు పెంచాలని సంస్థ నిర్ణయించినట్టు నివేదికలు పేర్కొంటున్నాయని’ తెలిపారు.

విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో సింగరేణి బొగ్గు సరఫరా వ్యవస్థ కూడా ఒకటని ఆరోపించారు. జెన్కోకు నాణ్యమైన బొగ్గు అందించాల్సిన సింగరేణి.. తక్కువ నాణ్యత కలిగిన జీ-13, జీ14 గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తున్నదని అన్నారు. నాసిరకం బొగ్గు వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో రూ. 2,900 కోట్ల ప్రజాధనం నష్టపోయిందని పేర్కొన్నారు. సింగరేణి నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, దీనిలో సుమారు రూ. 1,600 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న తమ పార్టీ ఆరోపణలను మరోసారి ప్రస్తావించారు.

బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంటే థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు నిలిచిపోతున్నాయని ప్రశ్నించారు. సింగరేణి నుంచి జెన్కోకు బొగ్గు సరఫరా, జెన్కో నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిల వ్యవహారంపై కూడా కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.52 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆరోపించారు. బకాయిల చెల్లింపులు నిలిచిపోవడం సంస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థతో ‘ఫుట్ బాల్ ఆట’ ఆడుతున్నదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సింగరేణి కార్మికులు, రైతులు, పరిశ్రమలు, ఐటీ పార్కుల భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి రావద్దని అన్నారు. బొగ్గు ఉత్పత్తి, సరఫరా, ఆర్థిక వ్యవహారాలు, పవర్ ప్లాంట్ల నిర్వహణపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ‘గ్రాస్ మిస్‌మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, గ్రాస్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, గ్రాస్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్’ జరుగుతున్నదని ఆరోపించారు.

సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ల పేరుతో అక్రమాలు, సోలార్ పవర్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని తమ పార్టీ ఆధారాలతో వెల్లడించిందని చెప్పారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023--24లో 70 మిలియన్ టన్నుల నుంచి 2025--26లో 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని పేర్కొన్నారు. ఈ గణాంకాల ఆధారంగా సంస్థ పనితీరుపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆరు బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన.. 

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి ప్రకృతి పరిస్థితులే కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం, చేతకానితనం, మిస్ మేనెజ్‌మెంట్, కమిషన్లు, అవినీతి కారణమని కేటీఆర్ ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన విద్యుత్ మౌలిక వసతులను సరిగా నిర్వహించకుండా ఉన్న వ్యవస్థను నాశనం చేసి, చెల్లాచెదురు చేసి, చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలోనూ రైతులు విద్యుత్ సమస్యపై రోడ్డెక్కారని ప్రస్తావించారు.

విద్యుత్ వ్యవస్థపై తాము చేస్తున్న ఆరోపణలకు క్షేత్రస్థాయి ఆధారాలు సేకరించేందుకు ఆరు బృందాలను పంపుతున్నట్టు ప్రకటించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలిస్తుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలోని బృందం సందర్శిస్తుంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ణు మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలోని బృందం పరిశీలించనుంది.

భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పరిశీలిస్తారని వెల్లడించారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు తదితరులు సందర్శించనున్నారని, హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు తదితరులు పరిశీలిస్తారని పేర్కొన్నారు.

బొగ్గు ఉత్పత్తి ఎంత? నిల్వలు ఎంత? ప్లాంట్లకు ఎంత బొగ్గు వస్తున్నది? ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది? ప్లాంట్ల సామర్థ్యం ఎంత? ఎందుకు యూనిట్లు నిలిచిపోయాయి? సింగరేణిజెన్కో మధ్య బకాయిల పరిస్థితి ఏమిటి? తదితర అంశాలను పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచుతామని కేటీఆర్ తెలిపారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని, పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన.. ఆరు బృందాల నివేదికల అనంతరం పార్టీ తరఫున తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు