సింగపూర్ ప్రధాని జీతం 27.14 కోట్లు!

10-09-2026 | 05:10am
  1. మంత్రుల జీతాలను 60 శాతానికి పైగా పెంచిన ప్రభుత్వం
  2. పెరిగిన జీతం మొత్తాన్ని విరాళంగా ఇస్తా: లారెన్స్ వాంగ్

కౌలాలంపూర్, సెప్టెంబర్ 8: దునియాలోనే అత్యధిక శాలరీ పొందుతున్న ప్రధానికి మళ్లీ జీతం పెరగనుంది. ఎంతనుకుంటున్నారు? 10 వేలు, 20 వేలు.. లక్షో.. పదిలక్షలో అనుకుంటే పొరపడినట్టే సుమా! ఏకంగా ఏడాదికి రూ.7.51 కోట్ల హైక్‌కు చేరనుంది. అలాగే ఆ దేశ మంత్రులకూ 60 శాతంపైగానే జీతాలు(Salaries) పెరుగుతున్నాయి. ఏ దేశంలో అబ్బా..! అనుకుంటున్నారా..? అదేనండి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన సింగపూర్‌(Singapore)లో మంత్రులకు 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారీస్థాయిలో వేతనాలు పెరగనున్నాయి.

పెరుగిన జీతంతో ఆ దేశప్రదాని జీతం ఏడాదికి రూ.27.14 కోట్లకు చేరనుంది. రాజకీయాల్లో అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు, సుపరిపాలన అందించేందుకు, ప్రైవేట్ మార్కెట్‌(Private market)లో వేతనాల పోటీ(Wage competition)ని తట్టుకునేందుకు ఈ పెంపు అవసరమని పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్(Lawrence Wong) స్పష్టం చేశారు. కానీ షరతులు వర్తిస్తాయని తెలిపారు.

సవరించిన వేతన విధానం ప్రకారం.. అత్యల్ప శ్రేణిలో ఉన్న మంత్రి వార్షిక ప్రామాణిక వేతనం 1.1 మిలియన్ సింగపూర్ డాలర్ల (యూఎస్‌డీ 868,330) నుంచి 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల (యూఎస్‌డీ 1.42 మిలియన్లు) వరకు పెరుగుతుందని వాంగ్ చెప్పారు. అలాగే, ప్రధాన మంత్రి ప్రామాణిక వేతనం 2.2 మిలియన్ సింగపూర్ డాలర్ల (రూ.15 కోట్లు) నుంచి 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు(దాదాపు 27.14 కోట్లు) పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అయితే, మంత్రులు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు వెంటనే కొత్త ప్రామాణిక వేతన స్థాయికి మారరని వాంగ్ స్పష్టం చేశారు. దానికి బదులుగా, అక్టోబర్ 15 నుంచి వారికి గరిష్టంగా 9 శాతం వరకు ఒకేసారి సర్దుబాటు (జీతాల పెంపు) లభిస్తుందని, ఈ పెంపు కూడా వారి పనితీరు, బాధ్యతలపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుత పదవీకాలం ముగిసే సమయానికి అత్యల్ప శ్రేణిలోని చాలా మంది మంత్రులు సుమారు 1.35 మిలియన్ సింగపూర్ డాలర్ల వేతనాన్ని పొందుతారని వాంగ్ అంచనా వేస్తున్నారు.

ఆ తర్వాత వేతనాలు  1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల స్థాయికి చేరవని, పనితీరు, బాధ్యతల ఆధారంగా మారుతూ ఉంటాయని ఆయన చెప్పారు. ప్రధాని జీతం 9 శాతం పెంపుతో అది 2.4 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరుతుందని, రాబోయే ఐదేళ్లపాటు తన జీతంలో పెరిగిన మొత్తాన్ని పూర్తిగా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు