కోనరావుపేట పీహెచ్‌సీలో పాము కలకలం
– సదుపాయాల లేమితో రోగుల ఆందోళన
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం పాము ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సిబ్బంది, చికిత్స కోసం వచ్చిన రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అక్కడే ఉన్న స్థానికులు మాంధాల శ్రీనివాస్, రాస రవీందర్, దండు రాజు, సుర రాజయ్య, అల్లెపు వినోద్ తదితరులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పామును చంపివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ గోడ లేకపోవడం, పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు విస్తరించడం వల్ల తరచూ పాములు వస్తున్నాయని సిబ్బంది, రోగులు తెలిపారు.
పరిశుభ్రత లోపం ఆసుపత్రి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఇక వైద్య సదుపాయాల కొరత కూడా తీవ్ర సమస్యగా మారింది.పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన యాంటీ వెనం (విష నివారణ మందు) అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.బుధవారం రోజు నిమ్మపెల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పాము కాటుకు గురవగా, కోనరావుపేట పీహెచ్‌సీలో చికిత్స అందించలేక అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.అరకొర వసతులు, సిబ్బందితోనే ఆసుపత్రి నడుస్తుండటంతో మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సరైన సిబ్బంది, వైద్య పరికరాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని ప్రహరీ గోడ నిర్మాణం, పరిశుభ్రత మెరుగుదల, అవసరమైన సిబ్బంది నియామకం, అత్యవసర మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఆరోగ్య కేంద్రం చుట్టూ చెత్త, పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రత పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చని స్థానికులు సూచిస్తున్నారు.




