శ్రీకాంత్.. నా లైఫ్‌లో ఎక్కువ టేక్‌లు తీసుకున్న దర్శకుడు!
‘ది ప్యారడైజ్’ ప్రెస్‌మీట్‌లో మోహన్‌బాబు
నాని లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise). ఇందులో సీనియర్ నటుడు మోహన్‌బాబు (Mohan Babu)కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో(Directed by Srikanth Odela) రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదలై, ప్రస్తుతం సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన మీడియా ములాఖత్‌లో మోహన్‌బాబు మాట్లాడుతూ.. “మా గురువు దాసరిపై నిర్మాతలు నమ్మకం పెట్టుకునేవారు. ఇప్పుడు శ్రీకాంత్‌పై అదే నమ్మకం ఉంచారు నిర్మాత.
దర్శకుడు శ్రీకాంత్ ఈ కథను నాకు చాలా ధైర్యంగా చెప్పాడు. సికంజ మాలిక్‌లాంటి క్యారెక్టర్ చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్. నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడనుకోలేదు. నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. దాసరి నారాయణరావు కూడా చాలా టేకులు తీసుకునేవారు. నువ్వు చేసినవన్నీ బాగున్నాయి. కానీ ఇంకా అద్భుతంగా వస్తుందని చెప్పేవారు. శ్రీకాంత్‌తో పనిచేస్తున్నప్పుడు నాకు మా గురువు గుర్తొచ్చారు.
శ్రీకాంత్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. పాత్రను ఆ పాత్రగానే చూశాడు. ఒక నటుడిగా తనలో ఉన్న టాలెంటిను చూసి గర్వపడ్డాను. తను దర్శకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. తను దేశంలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు. సినిమా పరిశ్రమ అందరిదీ. ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్లను ముందుకు తీసుకెళుతుంది. శ్రీకాంత్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నానిని నేను ఎంతో అభిమానిస్తున్నా, ప్రేమిస్తున్నా, ఒక నటుడిగా గౌరవిస్తున్నా.
ఈ సినిమాలో నాని పడ్డ కష్టం ఆ భగవంతుడికే తెలుసు. ప్రజలు ఆశీర్వదించారు. ‘ప్యారడైజ్’ సూపర్‌డూపర్ హిట్ అయింది” అని చెప్పారు. హీరో నాని మాట్లాడుతూ.. “ఈ సినిమా విషయంలో అన్ని కొత్తగానే జరిగాయి. ఈ మధ్యకాలంలో సినిమాలకు రిలీజ్ అయిన ఉదయం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సాయంత్రానికి మిక్స్ రెస్పాన్స్‌గా మారిపోయింది. ‘ప్యారడైజ్’కి రివర్స్‌లో జరిగింది. ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాన్ని చాలా నిజాయితీగా చెప్తారు.
అలాంటి ప్రేక్షకులు ఉన్నంతవరకు తెలుగు సినిమా గొప్పగా ఉంటుంది. శ్రీకాంత్ ఒరిజినల్ పీస్. మాటల్లో చెప్పలేను. తన విషయంలో చాలా గర్వంగా ఉంటుంది. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్.. ఇదంతా ఒక తుఫాన్‌లా జరిగింది. ఎవర్ని కలిసినా, ఎక్కడికి వెళ్లినా ఒకటే టాపిక్ ఉంది. అదే ‘ప్యారడైజ్’ గెలుపు” అన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “మోహన్‌బా నాకు ఎంతో చనువు ఇచ్చారు.
ఆయనతో పని చేయడం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుగా భావిస్తా. ఈ ఫిలిం మేకింగ్ ప్రాసెస్‌లో నానికి చాలా కోపం వచ్చిందని, తిట్టారని, శ్రీకాంత్ అరిచాడని, అలిగాడని ఎన్నో విషయాలు విన్నా. మా ఎమోషన్‌ను సినిమాలతో ముడి పెట్టకూడదు. కచ్చితంగా ఆయన నన్ను భరించాలి. ఆయన నన్ను మోయాలి. మరో ఆప్షన్ లేదు (నవ్వుతూ). మా ఇద్దరి అనుబంధం ఇక్కడితో ఆగిపోయేది కాదు” అని చెప్పారు. ఇంకా ఈ వేడుకలో ప్రియదర్శి, సంపూర్ణేశ్‌బాబు మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.