అసెంబ్లీలో డూప్ ఫైటింగ్ డ్రామాలు!
కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్‌ఎస్ అవినీతి బట్టబయలు కాకుండా ఇరు పార్టీలు కుమ్మక్కు
ఫీజు రీయింబర్స్‌మెంట్, 22ఏ భూ దందాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ సమావేశాల(Telangana Legislative Assembly Sessions) తీరు అత్యంత జుగుప్సాకరంగా మారిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్(K Laxman) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి, ఎమ్మెల్యేలు బూతు పురాణాలు, వ్యక్తిగత దూషణలతో సభ హుందాతనాన్ని దిగజార్చారని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తుంటే, చౌకబారు పబ్లిసిటీ స్టంట్లతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
ఈ రెండు పార్టీలు కుమ్మక్కై చేస్తున్న డూప్ ఫైటింగ్ వల్ల ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశం(Media Conference)లో లక్ష్మణ్.. అసెంబ్లీ తీరుతెన్నులపై వి మర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం లో రాహుల్‌గాంధీ(Rahul Gandhi), ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi), రేవంత్‌రెడ్డి(Revanth Reddy)లు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను వెయ్యి రోజులవుతున్నా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమె త్తారు.
2 లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ హామీలు గాలికి కొట్టుకుపోయాయన్నా రు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.12వేల కో ట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి పెడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ. 3వే ల కోట్లు పెంచి మొత్తం రూ. 15వేల కోట్లకు చేర్చిందని మండిపడ్డారు.
కుర్చీని రెన్యూవల్ చేసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారసంస్థగా మారిందని కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఎటువంటి సర్వేలు, విచారణలు లేకుండా రాత్రికిరాత్రే దాదాపు కోటి ఎకరాల ప్రజల స్థలాలను 22ఏ నిషేధిత జాబితాలోకి నెట్టేసి, భూదందాలు సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి కూడబెట్టిన డబ్బు మూటలను ఢిల్లీకి కప్పంగా పంపిస్తూ రేవంత్‌రెడ్డి తన కుర్చీని రెన్యూవల్ చేసుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాడుతున్న బీజేపీ నేతలను అరెస్టు, కేసులు, లాఠీఛార్జీలతో అణచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చిం చే ధైర్యం లేక నల్ల బట్టలు వేసుకుని పారిపోయే రాహుల్‌గాంధీ తీరుకు, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగకుండా రేవంత్‌రెడ్డి చేస్తున్న గందరగోళానికి ఏమాత్రం తేడా లేదని డా.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, తెలంగాణ వచ్చాక పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ఈ ప్రాంతానికి ఏం చేశాయో, గడచిన పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో అసెంబ్లీ, పార్లమెంట్‌లోనైనా లేదా ఏదైనా బహిరంగ వేదికపై నైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు.
జమిలితోపాటే తెలంగాణ ఎన్నికలు
కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో పాటు స్థానిక సంస్థల్లోనూ మేయర్, చైర్మన్ పీఠాలను గెలిపించి బీజేపీని ఆదరిస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తికాగానే దేశవ్యాప్తంగా జరిగే జమిలి (ఏకకాల) ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు వస్తాయని, అందులో బీజేపీ గెలుస్తుందన్నారు.