12 August, 2026 | 9:25 PM

పీఆర్సీ సాధనకై ఉపాధ్యాయుల నిరసన

12-08-2026 07:41 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు బుధవారం బూర్గంపాడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త దశలవారీ ఆందోళనలో భాగంగా మండలంలోని పలు విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడేళ్లుగా ఆలస్యమైన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యం (డీఏ) వాయిదాలను మంజూరు చేయాలని, రద్దు చేసిన పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని నినదించారు.అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ సమ్మయ్యకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు బి. బాలు, కార్యదర్శి ఎం. సత్యనారాయణ, సహాయ కార్యదర్శి టి. రమేష్‌, విజయశ్రీ, అరుణ, జేవీ రమణి, శంకర్‌, వేదవ్యాస్‌, టీపీటీఎఫ్‌ జిల్లా నాయకుడు బి. ప్రసాదరావు, మండల కార్యదర్శి ఎం. రవి, జి. సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.