తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యుల రక్తదానం
కొత్తపల్లి,(విజయక్రాంతి): జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం(National Voluntary Blood Donation Day) సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ(Telangana Srinivasula Seva Organizes) ఆధ్వర్యంలో పలువురు శ్రీనివాసులు, మహిళలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తలసేమియా బాధిత పిల్లలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసుల రక్తదాన శిబిరం(Blood Donation) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి తెలిపారు.
సంస్థ నిర్ణయం మేరకు ప్రతి నెల రెండవ శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల బ్లడ్ బ్యాంకుల్లో ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. “సేవకు మారుపేరు శ్రీనివాస్.. పేగు బంధం కాదిది... పేరు బంధం” అనే ఆశయంతో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీనివాసులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఐక్యతతో సమాజ సేవ చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం సంస్థలో 40,000 మందికి పైగా శ్రీనివాసులు 56 వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఐదు ప్రత్యేక రక్తదాతల గ్రూపుల ద్వారా ఇప్పటివరకు 2,839 మంది రక్తదానం చేసి ప్రాణదాన యజ్ఞంలో భాగస్వాములయ్యారని వెల్లడించారు. ప్రతి శ్రీనివాసుడు స్వయంగా రక్తదానం చేయడంతో పాటు కనీసం మరో ఒక్కరిని రక్తదానం చేసేలా ప్రోత్సహించాలని కోరారు. వ్యక్తిగత కారణాల వల్ల నేరుగా రక్తదానం చేయలేని వారు తమ మిత్రులు, బంధువులను ప్రోత్సహించి ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా మహిళా రక్తదాతలకు సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.