రాయదుర్గం వక్ఫ్ భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి
మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా
ముషీరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రాయదుర్గంలోని జామీ నిజామీయా వక్ఫ్ భూములను విక్రయించే ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని ఇన్సా ఫ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సయ్య ద్ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆలిండియా తంజీమే ఇన్సాఫ్ ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో సోమవారం ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా సర్వే నంబర్ 23/1లోని సుమారు 512 ఎకరాల వక్ఫ్ భూములను రూ.5 వేల కోట్లకు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రభుత్వాలు తరతరాలుగా కాపాడుకుంటున్న వారి భూములను విక్రయించడం సరికాదన్నారు.
ఈ అంశంపై ఎంఐఎం మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.డి. ఫయాజ్, రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేల్, సామాజిక ఉద్యమకారులు మునీర్, ముజాహిద్, అడ్వకేట్ అఫ్జల్, మనన్, నాదీమ్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
