సంగీత్ రాగాలు మొదలు
యువతను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘సంగీత్(Sangeet)’ నుంచి తొలి పాట ‘నీ వల్లే’ విడుదలైంది. తద్వారా ‘సంగీత్’ మ్యూజికల్ జర్నీకి మేకర్స్ ప్రత్యేకంగా శ్రీకారం చుట్టారు. విక్రమ్ శివ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. లహరి ఫిల్మ్స్, ఆర్బీ స్టూడియోస్ బ్యానర్లపై జీ మనోహరన్, ఎల్ బాలకృష్ణ సమర్పణలో ‘సంగీత్’ తెరకెక్కుతోంది. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, శ్రవంతి నవీన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, మాజ్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
కన్నడలో తెరకెక్కిన ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన సాద్ ఖాన్ ‘సంగీత్’కు దర్శకత్వం వహిస్తున్నారు. సాద్ ఖాన్, సిద్ధాంత్ సుందర్ కలిసి కథను రచించారు. ప్రముఖ డిజిటల్ పర్సనాలిటీ, పోడ్కాస్ట్ హోస్ట్‌గా గుర్తింపు పొందిన నిఖిల్ విజయేంద్ర సింహా ‘సంగీత్’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆయనకు జోడీగా తేజు అశ్విని నటిస్తున్నారు. ఈ పాటకు సిద్ శ్రీరామ్ గాత్రం, అచు రాజామణి సంగీతం, విక్రమ్ శివ సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను వెల్లడించనున్నారు.