బర్తరఫ్ చేయాలి

08-09-2026 | 05:50am
  1. కేసీఆర్ ఉసిగొల్పడం వల్లే స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు 
  2. స్పీకర్‌కు అవమానమే కాదు.. తెలంగాణకు చీకటి రోజు 
  3. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్, సెప్టెంబర్  7 (విజయక్రాంతి) : శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌(Legislative Assembly Speaker Gaddam Prasad Kumar)ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నిన్న బీఆర్‌ఎస్ సభ్యుల(BRS members)ను ఫామ్‌హౌస్‌కు  పిలిపించి ఉసిగొల్పి పంపడం వల్లే ఎమ్మెల్సీ తాతా మధు(Thatha Madhu), ఆ పార్టీ నేతలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. స్పీకర్ పట్ల ఈ భాషను ప్రయోగించినందుకు తాతా మధును తక్షణమే చట్టసభ నుంచి డిస్మిస్ చేయాలని శాసన మండలి చైర్మన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు.

అలాగే తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  సభాపతి స్థానానికి ఎనలేని గౌరవం ఉందని, స్పీకర్‌ను  గౌరవించడం చట్టసభల కనీస సంస్కృతి అని సీఎం రేవంత్‌రెడ్డి  గుర్తుచేశారు. సభాపతిపై సభ్యసమాజం సహించలేని మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, తల్లిని అవమానించేలా మాట్లాడితే ఎవరికైనా రక్తం మరగదా.. ? అని ప్రశ్నించారు.

ఇది కేవలం స్పీకర్‌కు  జరిగిన అవమానం మాత్రమే కాదని, సభలోని ప్రజాప్రతినిధులందరికీ జరిగిన అవమానం అన్నారు. ‘సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది.  సభలో ముఖ్యమంత్రి అయినా, శాసన సభ్యుడు అయిన స్పీకర్‌కు సమానమే. అలాంటి స్పీకర్ మనసు గాయపడేలా బీఅరెస్ వ్యవహరించింది’ అని మండిపడ్డారు. 

మా చేతగాని తనంగా భావించొద్దు.. 

సభ్యుల హక్కులను కాపాడే స్పీకర్‌ను ఉద్దేశపూర్వకంగానే బీఆర్‌ఎస్ నేతలు అవమానించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘కొన్ని సం దర్భాల్లో ప్రభుత్వం సంయమనం పాటిస్తుంది.. దాన్ని మా చేతగానితనంగా భావించవద్ద’ని సీఎం హెచ్చరించారు. మేం ఏం చేసినా చూసుకునేందుకు మా నాయకుడు ఉన్నాడన్న అహంకారం బీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో శాసనసభా స్పీకర్‌కు ఇలాంటి అవమానం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

‘నేను ఎన్నో సభలను (జడ్పీటీసీ, శాస న మండలి, శాసన సభ, పార్లమెంట్) చూశాను.. ఇంత అభ్యంతరకరమైన భాషను చట్టసభల వద్ద వాడటం ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వైఖరిని క్షమిస్తూ పోతే ప్రజాస్వామ్య వ్యవస్థలకు, చట్టసభలకు ఉన్న గౌరవ మర్యాదలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి’ అని సీఎం  హెచ్చరించారు.

బీఆర్‌ఎస్ అంటేనే దళిత వ్యతిరేకి.. 

‘స్పీకర్ పదవి అనేది ఒక అత్యున్నత స్థానం. సభాపతిని గౌరవించడం మన సంప్రదాయం. అలాంటి స్పీకర్‌పై సభ్య సమాజం తలవంచుకునేలా కొంతమంది మాట్లాడారు. ఇది సభకు జరిగిన అవమానంగా భావించి సభ్యులు దీనిపై చర్చ పెట్టారు. ఇది సభ గౌరవానికి సం బంధించిన విషయం. భవిష్యత్ తరాలు మన నుంచి నేర్చుకునేలా మన వ్యవహార శైలి ఉం డాలి. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం. తెలంగాణకు ఇది ఒక చీకటి రోజు. ఇంత అనుచిత భాషతో దూషించడం ఇది క్షమించరాని నేరం.

సభాపతిని, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడారు.  ఇది కేవలం దళితులకు జరిగి న అవమానం కాదు.. ఇది అందరికీ జరిగిన అవమానం. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని,  దళితులకు మూడెకరాలు ఇస్తాన ని, దళిత బంధు ఇస్తామని నమ్మించారని, చివరకు  దళిత ఉప ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేశారు. నేరెళ్లలో ఇసుక లారీలను  అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారు. 

బీఆరెస్‌ది దళిత వ్యతిరేక ఆలోచన, దళిత వ్యతిరేక వైఖరి. తల్లిని అవమానించేలా మాట్లాడటం ఇది మాకు అం దరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం. మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోం’ అని సీఎం హెచ్చరించారు. 

చీకటి మిత్రుడిని కాపాడుతున్న బీజేపీ.. 

మరోవైపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించిన తర్వాతే బీజేపీ లేవనెత్తిన అంశాలపై చర్చ జరుపుతామన్నారు. చీకటి మిత్రులైన బీఆర్‌ఎస్ నేతలను కాపాడేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అసలు వాళ్లను రక్షించాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూలంకషంగా చర్చ జరిగాక సభ నిర్ణయం తీసుకుంటుందని, చర్చ జరగకుండా నిర్ణయం తీసుకోమనడం వారి చీకటి మిత్రులను కాపాడాలనే ప్రయత్నమేనని అన్నారు.  ఇదే సభలో కాళేశ్వరం పై చర్చించి విచారణకు ఆదేశించామని సీఎం గుర్తుచేశారు. 

తాతా మధుపై చర్యలు తీసుకోండి

దళిత స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తాతామధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. అసెంబ్లీలో సీఎను కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎంను కలిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు దళితులంటే చిన్నచూపు అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు