ఆత్మగౌరవ అగ్నికణం ఐలమ్మ

10-09-2026 | 05:10am

నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి :

తెలంగాణ(Telangana) నేల కేవలం పండిత పామరుల సాహిత్య సౌరభాలకే కాదు, సమరశీల ప్రజా పోరాటాల మహో గ్ర గర్జనలకు కూడా పురిటిగడ్డగా నిలిచింది. పాల్కురికి సోమనాథుని దేశి కవితా విప్లవం, బమ్మెర పోతన ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యను’ రాజులకు అంకి తమివ్వనన్న ఆత్మాభిమాన నిరసన వెల్లివిరిసిన ఈ చారిత్రక గడ్డపై, శ్రమజీవుల స్వేచ్ఛా పతాకమై ఎగిరిన అపురూప విప్లవ తేజం చిట్యాల ఐలమ్మ.

చాకలి ఐలమ్మ(Chakali Ailamma)గా కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ధీరవనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట(Telangana Peasant Armed Struggle) యవనికపై ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అణగారిన వర్గాల ఆత్మగౌరవ అగ్నికణం. 1895 సెప్టెంబరు 26న నాటి నిజాం రాజ్యం(Nizam Kingdom) పరిధిలోని వరంగల్(Warangal) సుబా, జనగామ తాలూకా కిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు నాల్గవ సంతానంగా ఐలమ్మ జన్మించింది.

నిరుపేద కుటుంబంలో పెరిగిన ఆమెకు, యుక్తవయసులోనే సమీపంలోని పాలకుర్తి గ్రామానికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహమైంది. అయితే పేదరికం నిత్యకృత్యమైన ఆ రోజుల్లో కులవృత్తిపైనే ఆధారపడ టం అసాధ్యం కావడంతో, కుటుంబ పోషణార్థం వ్యవసాయాన్ని కూడా జీవనోపాధిగా ఎంచుకోవాల్సి వచ్చింది.

ఆ కాలంలో గ్రామీణ తెలంగాణ సమాజం దేశ్‌ముఖ్‌లు, జమీందార్లు, పటేల్- పట్వారీలు, జాగీర్దార్ల నిరంకుశ కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు వేలాది ఎకరాల భూములను తమ గుప్పిట్లో ఉంచుకుని రైతుల శ్రమని, రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పిచేసేవారు. పాలకుర్తి పరిసర ప్రాంతాలన్నీ విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి, ఆయన తల్లి జానకమ్మ అలియాస్ ‘విస్నూరు దొరసాని’ పెత్తనంలో నలిగిపోతున్నాయి.

అలాంటి అంధకార యుగంలో, భూస్వాముల దౌర్జన్యాలను ఎదిరించేందుకు 1930వ దశకంలో రూపుదిద్దుకున్న ‘ఆంధ్ర మహాసభ(Andhra Mahasabha)’, అనంతరం కార్మిక--రైతాంగ విముక్తి లక్ష్యంగా పుంజుకున్న కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు తెలంగాణ పల్లెల్లో ‘సంఘం’ పేరుతో ప్రజల్లో విప్లవ చైతన్యాన్ని రగిలించాయి. అణగారిన వర్గాల బాధలను అర్థం చేసుకున్న ఐలమ్మ, ఏ మాత్రం తటపటాయించకుండా ఎర్రజెం డా అండను కోరుతూ సంఘంలో క్రియాశీలకంగా చేరారు.

ఐలమ్మ జీవితాన్ని ప్రపంచ విప్లవ పోరాటాల సరసన నిలబెట్టిన చారిత్రక ఘట్టం విస్నూరు దేశ్‌ముఖ్ దురాగతాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించింది. పాలకుర్తిలోని భూస్వామి మల్లంపల్లి కొండలరావుకు చెం దిన 40 ఎకరాల భూమిలో ఐలమ్మ నాలు గు ఎకరాల భూమిని వార్షిక కౌలు ప్రాతిపదికన తీసుకుని, తన చెమటను ధారపోసి బంగారు పంటలు పండించారు. అయితే సంఘంలో చేరిన ఒక సామాన్య రజక మహిళ స్వతంత్రంగా తలెత్తుకుని జీవించడం,సంఘం సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం విస్నూరు దేశ్‌ముఖ్ అహంకారానికి తీరని అవమానంగా తోచింది.

ఆమెను లొంగదీసుకోవడానికి, ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించడానికి దేశ్‌ముఖ్ కుయుక్తులు పన్నాడు. ఐలమ్మ భర్త నర్సయ్యను, ఇద్దరు కుమారులను అక్రమ కేసులతో ఇరికించి జనగామ జైలుకు పంపించాడు. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన మగవాళ్లంతా జైలుపాలైనా, ఐలమ్మ గుండెల్లో భయం లేశమాత్రమైనా ప్రవేశించలేదు. పండిన జొన్న పంటను కొల్లగొట్టడానికి దేశ్‌ముఖ్ తన గూండాలను పంపాడు.

అప్పుడు ఐలమ్మ చూపిన సాహసం అపూర్వం, అనితర సాధ్యం. ‘నేను కష్టపడి దున్నిన నేల ఇది, నా నెత్తురు ధారపోసి పం డించిన పంట ఇది. నా కష్టార్జితాన్ని ఆ రాబందుల పాలుచేయను. ప్రాణాలైనా అర్పిస్తాను గానీ, ఒక్క గింజను కూడా ఆ దొరలకు వదులుకోను’ అంటూ కొంగును నడుముకు చుట్టి, చేతిలో పదునైన కొడవలి పట్టి సింహంలా కల్లంలో నిలబడ్డారు.

ఆమె పిలుపుతో కమ్యూనిస్టు సంఘం కార్యకర్తలు, కర్రలు, ఒడిసెలలు పట్టిన శ్రామి క మహిళలు, వ్యవసాయ కూలీలు వందలాదిగా కల్లం వద్దకు కదిలివచ్చారు. దొర గూం డాలు విరుచుకుపడుతుంటే ఐలమ్మ వీరనారిలా పోరాడి, వారిని తరిమికొట్టారు. మహి ళల రక్షణ కవచం నడుమ స్వయంగా ధాన్యాన్ని బండ్లకెత్తించి, రజాకార్లు అడ్డుకోకుండా ఊరేగింపుగా తన ఇంటికి చేర్చి భద్ర పరిచారు.

శ్రమజీవి చెమట చుక్కపై దోపిడీదారులకు ఎటువంటి హక్కు లేదని బల్లగు ద్ది చాటిన ఈ వీరోచిత ఘట్టం నాటి నిజాం రాజ్యాన్ని కుదిపివేసింది. పాలకుర్తిలో ఐల మ్మ రగిలించిన ఈ ఆత్మగౌరవ తిరుగుబా టు 1946 జూలై 4న కడవెండి గ్రామంలో విస్నూరు దేశ్‌ముఖ్ గూండాల తూటాలకు బలైన దొడ్డి కొమరయ్య అమరత్వంతో కలిసి దావానలంలా విస్తరించింది. ఇది చివరకు 1946 నుంచి 1951 వరకు కొనసాగిన ప్రపంచ ప్రఖ్యాత ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’గా విశ్వవ్యాప్తమైంది.

ఐలమ్మ ఎదిరించిన దెబ్బకు దేశ్‌ముఖ్ కక్ష పెంచుకుని ఆమెపై పగబట్టాడు. నిజాం పోలీసులతో, రజాకార్లతో కుమ్మక్కై ఆమె ఇంటిని లూటీ చేయించాడు, ఇళ్లను తగుల బెట్టించాడు, ఆమె భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు. చివరికి ఆమె కుమార్తె సోమనర్సమ్మను కూడా చిత్రహింసలకు గురిచేశాడు. అయినప్పటికీ ఐలమ్మ ఆత్మస్థైర్యం ఇసుమంతైనా చెక్కుచెదరలేదు. ఆమె అందించిన స్ఫూర్తితో సాగి న సాయుధ పోరాటంలో దాదాపు 3,000 గ్రామాలు నిజాం నిరంకుశత్వం నుంచి విముక్తి చెంది గ్రామరాజ్యాలుగా ఏర్పడ్డా యి.

పది లక్షల ఎకరాల భూస్వామ్య భూమి ని స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు, వ్యవసాయ కూలీలకు పంచడం ప్రపంచ విప్లవ చరిత్రలోనే అద్భుత ప్రజా విజయం గా లిఖించబడింది. నాలుగు వేల మందికి పైగా వీరులు ఈ పోరాటంలో తమ నెత్తురు ధారపోసి అమరులయ్యారు. ఈ సమస్త చారిత్రక ఉద్యమానికి తొలి నిప్పురవ్వను రాజేసిన గౌరవం నిస్సందేహంగా చిట్యాల ఐలమ్మదే.

కులం పరంగా రజక వృత్తి వివక్షను, వర్గం పరంగా పేదరిక దోపిడీని, లింగం పరంగా పితృస్వామ్య అణచివేతను ఇలా ముప్పేట దాష్టీకాలను ఒకేసారి బద్దలు కొట్టిన అసమాన విప్లవ చైతన్యం ఐలమ్మ. 1985 సెప్టెంబరు 10న ఐలమ్మ భౌతికకా యం నేలకొరిగినా, ఆమె రగిల్చిన ఆత్మగౌర వ కాగడా తరతరాల ప్రజలకు మార్గదర్శనం చేస్తూనే ఉంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆమె వీరత్వాన్ని సముచిత రీతిలో గౌరవిస్తూ, సెప్టెంబరు 26న ఐలమ్మ జయంతిని, సెప్టెంబరు 10న వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా హైద రాబాద్ కోఠిలోని ప్రతిష్ఠాత్మక మహిళా విశ్వవిద్యాలయానికి ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం’గా నామకరణం చేసి, ఆమె పోరాట వారసత్వాన్ని ఉన్నత విద్యా పీఠంపై సగర్వంగా నిలిపారు. పాలకు ర్తి కొండల నడుమ రగిలిన ఐలమ్మ పోరాట కెరటం తెలంగాణ ప్రజల నరనరాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది.

రామకిష్టయ్య సంగనభట్ల 

వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494

మరిన్ని వార్తలు