రెండు డీఏలు దసరాకు

24-09-2026 | 05:35am

మరోటి మార్చిలోపు.. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ

డిప్యూటీ సీఎం భట్టితో ఉద్యోగ జేఏసీ నేతల చర్చలు సఫలం

  1.    10 రోజుల్లో పీఆర్సీ నివేదిక 
  2. మార్చిలోపు పెండింగ్ బిల్లుల చెల్లింపు
  3. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలుకు కమిటీ 
  4. అధ్యయనానికి మూడు నెలల కాలపరిమితి 
  5. మిగిలిన సమస్యలపై వారంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): దసరాకు ఒకేసారి రెండు డీఏలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) అంగీకరించింది. వీటిని అక్టోబర్ 1న జరిగే కేబినెట్ భేటీ(Cabinet meeting)లో ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చింది. మరో డీఏను మార్చి నెలలోపు అందజేస్తామని ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ(Telangana Employees JAC) నేతలు బుధవారం రాత్రి ఎంసీహెచ్‌ఆర్డీ కేంద్రంలో సమావేశమై ప్రధాన డిమాండ్లపై చర్చించారు. ఈ చర్చలు సఫలమయ్యాయి.

సమావేశం అనంతరం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు వివరాలను మీడియాకు వెల్లడించారు. దసరాకు రెండు డీఏలు ఒకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పిందని, మరోటి మార్చిలోపు ఇస్తామని తెలిపిందని వారు వివరించారు. పీఆర్సీ కమిటీ గడువు ఈ నెల 30 వరకు ముగుస్తుందని, దాన్ని పొడిగించకుండా నివేదికను పది రోజుల్లో తెప్పించుకుని విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చిందన్నారు.

అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ

పెండింగ్ బిల్లులను ప్రస్తుతం ప్రతి నెలా రూ. వెయ్యి కోట్లు చెల్లిస్తున్నదని, వీటికి అదనంగా చెల్లింపులు చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామని జేఏసీ నేతలు తెలిపా రు. దీంతో మార్చి నెల వరకు బిల్లులన్నీ పూర్తి చేస్తామని అంగీకరించిందని వారు వెల్లడించారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలుపై అధ్యయనానికి మూడునెలల కాలపరిమితితో అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు. 

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు(Employees, teachers, and pensioners) చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీఏ(Dearness allowances), పీఆర్సీ, పెండింగ్ బిల్లుల విడుదలతోపాటు సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వారు తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం జేఏసీ నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ హామీ ల అమలును పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో గురువారం జరగాల్సిన జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వారు ప్రకటించారు. 

మిగతా సమస్యలపై వారంలో చర్చ..

ఉద్యోగ, ఉపాధ్యాయుల మిగిలిన సమస్యలపై వారం రోజుల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు వివరించారు. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన సమావేశంలో జేఏసీ నాయకులు ముజీబ్ హుస్సేనీ, పుల్గం దామోదర్ రెడ్డి, సదానందం గౌడ్, కస్తూరి వెంకటేష్, మధుసూదన్ రెడ్డి, చావ రవి, కటకం రమేష్ ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. 

అంతకు ముందు సీఎస్‌తో చర్చలు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కంటే ముందు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో సమావేశమయ్యారు. ప్రధాన డిమాండ్లపై చర్చించారు. 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మూడు డీఏలు ఇవ్వాలని.. ఇందులోనూ రెండు డీఏలు దసరాకు, ఒక డీఏను మూడు నెలల తర్వాత ఇవ్వాలని జేఏసీ నేతలు సీఎస్‌ను కోరారు. ప్రతి నెల పెండింగ్ బిల్లులను రూ. వెయ్యి కోట్లు కాకుండా దాన్ని 2 వేల కోట్లకు పెంచి, అందులో 50 శాతం రెగ్యులర్ ఉద్యోగులకు, 50 శాతం పెన్షనర్లకు ఇవ్వాలన్నారు.

కనీసం రూ.1,500 కోట్లయినా చెల్లించాలని కోరారు. పీఆర్సీ అమలు గురించి ప్రసావించారు. సీపీఎస్‌పై కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎస్ తెలిపారు. అయితే.. ఈ సమావేశంలో సరైన స్పందన రాలేదని, ఉద్యమ కార్యాచరణపై గురువారం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటామని సీఎస్‌తో భేటీ తర్వాత జేఏసీ నేతలు తెలిపారు. కానీ, రాత్రి డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమై డిమాండ్లపై చర్చించడం, ప్రభుత్వం నుంచి హామీ దక్కడంతో వెనక్కి తగ్గారు. గురువారం నాటి సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.

మరిన్ని వార్తలు