లోక్ అదాలత్‌లో రాజీతో ఇరు వర్గాలకు విజయం

12-09-2026 | 07:09pm

జడ్జి స్వరూప కాటం

ఇల్లెందు టౌన్ సెప్టెంబర్ 12 విజయక్రాంతి: లోక్ అదాలత్‌లో రాజీ పడటం ద్వారా ఇరు వర్గాలు విజయం సాధించినట్లేనని ఇల్లెందు కోర్టు జడ్జి స్వరూప కాటం అన్నారు. శనివారం ఇల్లెందు కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజీ పడదగిన పోలీస్ కేసులు, గృహహింస, మనోవర్తి, చెక్ బౌన్స్, సివిల్ కేసులను కక్షిదారులు పంతాలకు పోకుండా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు.

దీనివల్ల విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన కేసుల్లో పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 583 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కక్షిదారులకు అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.ఎం.డి. కాసిం, సీనియర్ న్యాయవాదులు బాలకృష్ణ, దంతాల ఆనంద్, పప్పుల గోపీనాథ్, న్యాయవాదులు కీర్తి కార్తిక్, మామిడి సత్యప్రకాష్, పైల జయప్రకాష్, కే. ఉమామహేశ్వరరావు, ఎస్. సత్యనారాయణ దొర, కోర్టు సూపరింటెండెంట్ శ్రీరంగం రామకృష్ణ, పోలీస్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు