యూపీఐ ఛార్జీలపై విజయ్ శేఖర్ శర్మ కీలక వ్యాఖ్యలు

16-09-2026 | 03:57pm

యూపీఐ లావాదేవీలపై కొత్తగా ఛార్జీలు విధించాలన్న నిర్ణయంపై పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. రూ.2,000కు మించిన కొన్ని ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలన్న ఎన్‌పీసీఐ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఈ విధానం ‘రాబిన్ హుడ్’ తరహాలో ఉంటుందని, దీని ద్వారా సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

పెద్ద ఇ-కామర్స్ సంస్థలు, రిటైల్ చైన్లు వంటి భారీ వ్యాపారుల నుంచి వసూలయ్యే ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలకు యూపీఐ సేవలను ఉచితంగా అందించేందుకు ఉపయోగించవచ్చని శర్మ వివరించారు.ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలకు ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పటివరకు యూపీఐ వ్యవస్థ ప్రధానంగా ప్రభుత్వ మద్దతుతో కొనసాగిందని పేర్కొంటూ.. కొత్త విధానం యూపీఐ వ్యవస్థ ఆర్థికంగా మరింత స్థిరపడేందుకు దోహదపడుతుందని అన్నారు.

చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడుతూ యూపీఐ సేవలను విస్తృతంగా అందుబాటులో ఉంచే విధంగా ఈ నిర్ణయం ఉండటం సానుకూల పరిణామమని విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.

పేటీఎం షేర్లకు జోష్

యూపీఐ ఛార్జీలపై ప్రకటన వెలువడిన అనంతరం పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లలో భారీ కదలిక కనిపించింది. ఇంట్రాడేలో షేరు ధర 7.24 శాతం వరకు పెరిగి రూ.1,856.50 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది.పేటీఎం షేర్లతో పాటు మొబిక్విక్, పైన్ ల్యాబ్స్ వంటి ఇతర ఫిన్‌టెక్ కంపెనీల షేర్లలోనూ సానుకూల ధోరణి కనిపించింది. యూపీఐ లావాదేవీలపై కొత్త ఛార్జీల విధానం ఫిన్‌టెక్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై మార్కెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.

మరిన్ని వార్తలు