భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలి

08-09-2026 | 04:10am
  1. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
  2. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ వ్బుసైట్లో పూర్తి వివరాలను నమోదు చేసి అనుమతి పొందాలని సూచించారు. ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వారు సంబంధిత పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతులు పొందిన తర్వాతే మండపాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద జూదం, అభ్యంతరకర ప్రసంగాలు, అవాంఛనీయ కార్యకలాపాలకు తావివ్వకుండా భక్తి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని తెలిపారు.

మసీదులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాల సమీపంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రార్థనా సమయాల్లో మసీదుల సమీపంలోని మండపాల నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని కలెక్టర్ సూచించారు. డీజేలకు అనుమతి లేదని, మండపాల వద్ద భక్తిగీతాలను మాత్రమే వినిపించాలని స్పష్టం చేశారు.

ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ తీగలు, స్విచ్ బోర్డులు, దీపాలను సురక్షితంగా ఏర్పాటు చేయాలని, విద్యుత్ కనెక్షన్ల కోసం ముందుగానే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రమాదాలకు తావులేకుండా నాణ్యమైన విద్యుత్ పరికరాలను వినియోగించాలని తెలిపారు.

పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్లు పంచాయతీ కార్యదర్శులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలన్నారు.

అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు