నీళ్లు తెచ్చుకుంటేనే బడి!?

10-09-2026 | 04:45am

కల్వల ‘ఆదర్శ’ పాఠశాలలో నీటి గోస

ఇంటి నుంచే తాగు నీరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులకు మెసేజ్‌లు

చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి

మహబూబాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): చదువుకోవాలంటే బడిలో సార్లు ఉండాలి.. పుస్తకాలు ఉండాలి.. రాయడానికి పెన్నులు ఉండాలి.. కానీ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ (ఆదర్శ పాఠశాల) విద్యార్థులు మాత్రం తమ తాగునీటి అవసరాలతో పాటు దైనందిన అవసరాలకు కూడా ఇంటి నుండి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

పాఠశాలలో హాస్టల్ తో పాటు ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 400 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో దైనందిన అవసరాలకు, తాగునీటికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు లేవు. బోరు పాడైపోయి నెలలు గడుస్తున్న మరమ్మతులు చేయలేదు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటితో ఇంతకాలం నెట్టుకొచ్చారు.

ఇటీవల ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో మిషన్ భగీరథ నీటికి కోత పెట్టారు. గతంలో ఇచ్చిన మాదిరిగా ఇబ్బడి ముబ్బడిగా నీరు వదలకుండా కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే విడుదల చేస్తుండడంతో ఆదర్శ పాఠశాలలో 400 మంది పైగా విద్యార్థులకు దైనందిన అవసరాలైన ఒకటి.. రెండుకు ఉగ్గ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొందరు ఆ బాధను బయటకు చెప్పుకోలేక ఇంటికి వెళ్లేంతవరకు పడుతున్న వేదన వర్ణనాతీతంగా మారింది. కేసముద్రం మండల వ్యాప్తంగా ఈ పాఠశాలకు అన్ని గ్రామాల నుండి విద్యార్థులు వస్తున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు పాఠ్యపుస్తకాలు నోటి పుస్తకాలతో పాటు తాగునీరు, ఇతర అవసరాల కోసం కూడా నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

మోడల్ స్కూల్ పేరుకే గాని తాగునీటి సమస్య పరిష్కారానికి ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాత్కాలికంగా ఇబ్బంది కలిగించడానికి మధ్యాహ్న భోజనానికి, హాస్టల్ విద్యార్థుల కోసం గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరు తెప్పిస్తున్నారు. అలాగే తాగునీటి కోసం మినరల్ వాటర్ క్యాన్లు పోయిస్తున్నారు. వచ్చిన నీటి ట్యాంకర్ వంటకి, హాస్టల్ విద్యార్థులకు వినియోగిస్తున్నారు.  పూర్తిస్థాయిలో నీటి సమస్య తొలగించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పేరెంట్స్ సెల్ ఫోన్‌లకు మెసేజ్‌లు

మోడల్ స్కూల్ కు వచ్చే విద్యార్థులకు పేరెంట్స్ సెల్ ఫోన్లకు తమ పిల్లలు వెంట నీళ్ళు తెచ్చుకునే విధంగా చూడాలంటూ ఉపాధ్యాయులు మెసేజ్ పంపిస్తున్నారు. సాధారణంగా విద్యార్థులు హోంవర్క్ చేయడం లేదని, చెప్పిన పాఠాలు సరిగా వినడం లేదని వాటి పట్ల శ్రద్ధ వహించాలంటూ పేరెంట్స్‌కి ఉపాధ్యాయులు సూచించడం సర్వసాధారణం. అయితే ఇందుకు భిన్నంగా కల్వల మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు వెంటనీరు పంపించాలని సెల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపించడం పాఠశాలలో నీటికి ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది స్పష్టం అవుతుంది.

నీటికి అరిగోస పడుతున్నారు

మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యాబోధన ఇతర అంశాలు అన్నీ బాగానే ఉన్నా, నీటికి అరి గోస పడుతున్నారు. దైనందిన అవసరాలకి చెప్పన లవి ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజులకు ఒకసారి బట్టలు ఉతకడానికి ఇంటికి పంపిస్తున్నారు. మూడు రోజుల నుండి పాఠశాలలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే చర్యలు తీసుకుని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.

 పేరెంట్, ఇనుగుర్తి

మరిన్ని వార్తలు