కేటీఆర్ కోటను బద్దలు కొడతాం

27-09-2026 | 05:30am

లక్ష మందితో సిరిసిల్లలో సభ

  1. రాజకీయ మార్పు తథ్యం
  2. ఫిరాయింపులపై కేటీఆర్‌ది ద్వంద్వ వైఖరి
  3. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ ఏర్పాట్లు, జన సమీకరణపై కాంగ్రెస్ నేతలతో సమావేశం
  4. హాజరైన మంత్రులు అడ్లూరి, తుమ్మల

రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి కేటీఆర్‌కు లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. ఈ నెల 30న లక్ష మందితో -సిరిసిల్లలో సభ నిర్వహిస్తామని, ఈ సభతో రాజకీయ మార్పు తథ్య మని పేర్కొన్నారు. ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించనున్న సభ ఏర్పాట్లు, జన సమీకరణపై శనివారం సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, వారిలో 13 మందిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి కేటీఆర్ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురిం చి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో నాయకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పలువురు కేటీఆర్ నాయకత్వంతో విభేదించి తిరిగి కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ముంపు గ్రామాల ప్రజలకి చ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఇతర నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

వేములవాడ నియోజకవర్గ పోరాట స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీ కరించాలని సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో యువరాజుగా పిలవబడే కేటీఆర్ కోటను బద్దలు కొట్టి సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 1989 నుంచి సిరిసిల్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవకపోయినా కార్యకర్తలు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారని తెలిపారు. 

సీఎం సభను విజయవంతం చేయాలి..

ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సమావేశం నిర్వహించారు.

ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రాను న్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు