గ్రేటర్ పోల్స్ ఇంకెప్పుడో?

23-09-2026 | 05:20am

డిసెంబర్‌లోనా.. ముంబై మాదిరి మరింత ఆలస్యమా!

  1. ఆరునెలల కింద ముగిసిన జీహెచ్‌ఎంసీ పదవీకాలం 
  2. మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం
  3. ఎన్నికల నిర్వహణపై కనిపించని స్పష్టత 
  4. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లదీ అదే పరిస్థితి 
  5. మరో ఆరు మున్సిపాలిటీలకూ ఎలక్షన్స్ పెండింగ్ 
  6. ఆశావహుల ఎదురుచూపులు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Hyderabad Municipal Corporation) (జీహెచ్‌ఎంపీ) పాలక మండలి పదవీకాలం ముగిసి దాదాపు ఆరున్నర నెలలు అవుతున్నది. ఇప్పటికీ  ఎన్నికలు లేవు. ఎప్పుడు పెడ్తారన్న దానిపై స్పష్టత లేదు. జీహెచ్‌ఎంసీని ప్రభుత్వం హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్(Hyderabad, Malkajgiri, Cyberabad) మూడు కార్పొరేషన్లుగా విభజించింది. కొత్త లోగోలను కూడా ఇటీవల విడుదల చేసింది.

కానీ, ఎన్నికలు(Elections) ఎప్పుడన్నది మాత్రం తేలకపోవడంతో ఆశావహులకు ఎదురుచూ పులు తప్పడం లేదు. పదవీకాలం పూర్తయిన గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మరో ఆరు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిపైనా క్లారిటీ లేదు. కొన్నినెలలుగా అధికారుల పర్యవేక్షణలోనే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాలన కొనసాగుతున్నది. 

ముంబై మాదిరి నాలుగేండ్లకా..?

రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ మొత్తం అక్టోబర్ రెండో వారంలో ముగుస్తుంది. అదం తా అయిపోయాక.. డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచ నలో ప్రభుత్వం ఉన్నట్లు ఆశావహులు అంచనా వేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లో కనిపిస్తున్న రాజకీయ పార్టీల హడావుడి ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు. అయితే, మరో వాదన కూడా వినిపిస్తున్నది. ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు.. దాదాపు నాలు గేండ్లు ఆలస్యంగా జరిగాయి. అదే పరిస్థితి ఇక్కడ జీహెచ్‌ఎంసీకి రావొచ్చేమోనన్న చర్చ ఉంది. 

ఎప్పుడొచ్చినా పార్టీలకు సవాలే..

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్ ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారనున్నాయి. మరో రెండేండ్లలో  రాష్ట్రంలో అసెంబ్లీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు(Parliamentary Elections) జరగనున్నాయి. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్(Municipal Corporation Elections) పెడితే, ఆ ఫలితాల ప్రభావం..  అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని లీడర్లు నమ్ముతున్నారు. మున్సి‘పోల్స్’లో సత్తా చాటితేనే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టునిలుపుకోవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా..? భవిష్యత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు ఉన్నాయి.

పైగా, జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు కీలకమైనవి కావడం.. వాటికి ఎన్నికలు జరిగితే పరిసరాల్లోని అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలపైనా ఆ ప్రభావం ఉండటంతో లీడర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక్క జీహెచ్‌ఎంసీ, దాని పరిసరాల్లోనే 26 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం ఎన్నికలు సెమీ ఫైనల్ లాంటివని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సత్తాచాటాలని ముందుకు వెళ్తున్నాయి. 

ఆ మున్సిపాలిటీలకు కూడా..! 

రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అప్పటికీ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి కాకపోవడంతో.. వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ రెండు కార్పొరేషన్ల పదవీ కాలం మేలో ముగిసింది. జీహెచ్‌ఎంసీది ఫిబ్రవరి 10తో పూర్తయింది. జీహెచ్‌ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా చేసింది. వీటన్నింటికీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పలు కారణాలతో మందమర్రి, మణుగూరు, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్స్ జరగలేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సైతం  నిర్వహించాల్సి ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. 

మరిన్ని వార్తలు