దండయాత్ర ఎందుకు?
- రైతులపై కేసులు, పోలీసుల మోహరింపు దేనికి?
- బుల్లెట్ ట్రైన్‌కు వ్యతిరేకం కాదు
- పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టమన్నది ఎవరు? ఇప్పుడు ఎవరిని కొట్టాలి?
- బహదూర్‌పల్లిలో పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే
- రైతులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతుల భూములపై(Farmers lands) 4 వేల మంది పోలీసులను పంపి దండయాత్ర ఎందుకు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై బీఆర్‌ఎస్‌కు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టంచేశారు. కానీ ఆ పేరు మీద రియల్ ఎస్టేట్(Real Estate) దందా చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. ప్రాజెక్టుల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో రైతుల భూములకు అన్యాయం చేయడాన్ని మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న బహదూర్‌పల్లి రైతులతో సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న కేటీఆర్, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈసారి వస్తే మీ సెల్‌ఫోన్‌తో ఆ పోలీసోడి ఫొటో కొట్టండి.. మా కేసీఆర్(KCR) సార్ వస్తుండు.. మీ ఫొటో చూపెడ్తం అని చెప్పండి అని రైతులకు పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్‌లో ఫొటోలు పెట్టాలంటే ఎవరివి పెట్టాలని ప్రశ్నించారు. రౌడీ షీటర్లు, లంగలు, దొంగలు, మాట ఇచ్చి మోసం చేసినవారి ఫొటోలు పెట్టాలని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేస్తే వారి ఫొటోలు పోలీస్ స్టేషన్‌లో పెట్టాలన్నారు.
‘ఆడవాళ్లందరికీ నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేస్తే వారి ఫొటోలు పెట్టాలి. అత్తలకు రూ.4 వేలు, కోడళ్లకు రూ.2,500 ఇస్తామని లంగమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటే వారి ఫొటోలు పెట్టాలి. రైతులకు రూ.15 వేలు ఇస్తామని కథలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకుంటే వారి ఫొటోలు పెట్టాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ పట్టాలిస్తామని చెప్పారా? లేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
గతంలో ఇందిరమ్మ ఇచ్చిన భూములను ఇప్పుడు మళ్లీ ఇస్తామని చెప్పారని, పట్టాలు ఇవ్వాల్సిన వ్యక్తి మోసం చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫొటో పెట్టాలా? లేక రైతుల ఫొటోలు పెట్టా లా? అని నిలదీశారు. 420 హామీలు, 420 మాటలు చెప్పి గెలిచి గద్దెనెక్కి ఇవాళ గద్దలెక్క ప్రవర్తిస్తున్నోడి ఫొటో పోలీస్‌స్టేషన్‌లో పెట్టాలన్నారు. రైతుల భూముల విషయం లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
రైతుల ఇండ్ల మీదికి ఏదో పక్క దేశం మీద దండయాత్రకు పోయినట్టు 4 వేల మంది పోలీసోళ్లను పం పారని, నిజంగా నీతి, నిజాయితీ ఉంటే నీ దగ్గర, ప్రభుత్వం దగ్గర కాగితాలుంటాయి.. 4 వేల మంది పోలీసులను పంపే అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే వాటిని రైతులకు చూపించాలన్నారు. నిజంగా ప్రభుత్వం వద్ద కాగితాలు ఉంటే, భూమి తమదేనన్న విషయం స్పష్టంగా ఉంటే, ఇంతమంది పోలీసులను ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రైతుల భూముల విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలను బహిరంగంగా చూపించాలని డిమాండ్ చేశారు.
ఆ బాధ్యత నాదే...
రైతులకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు. మీకు పట్టాలివ్వకపోతే రాళ్లతో కొట్టమని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అంటే.. రేవంత్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టుమన్నడని గుర్తు చేశారు.మరి ఇప్పుడు ఎవరిని కొట్టాలి? రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా? ప్రకాశ్ గౌడ్‌ను కొట్టాలా? అని ప్ర శ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్ర భుత్వం నిలబెట్టుకోవాలని, భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చే శారు.
ప్రజల ఆశీర్వాదంతో సంవత్సరం తర్వాత కేసీఆర్ సీఎంగా వస్తారని, బహదూర్గూడలోనే మీటింగ్ పెట్టి, ఇదే కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు పట్టాలిస్తరు అని వెల్లడించారు. రైతుల తరఫున హైకోర్టుకు వెళ్లి న్యా యం కోసం పోరాడిన కార్తీక్ రెడ్డి ప్రస్తావిస్తూ, ఏ కార్తీక్ రెడ్డి అయితే ఇవాళ హైకో ర్టుకు పోయి మీకు న్యాయం చేసిండో.. ఇదే కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా మీకు పట్టాలిప్పించే బాధ్యత నాది అని కేటీఆర్ హామీ ఇచ్చారు. బహదూర్‌పల్లి రైతుల భూముల సమస్య పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ వారి తరఫున నిలబడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.