నిర్మల్ జిల్లా :ప్రధాన రహదారిపై రైతుల ఆందోళన
కుభీర్: అక్టోబర్ 16(విజయక్రాంతి): సాగు పంటలకు(Cultivated crops) నీరు ఇవ్వొద్దంటే తాము ఎలా బతకాలని రైతులు(Farmers) ఆవేదన వ్యక్తం చేశారు. సుద్ద వాగు బ్యాక్‌వాటర్(Sudda Vagu backwaters) ద్వారా సాగునీటిని వినియోగించుకుంటూ పంటలు పండిస్తున్న రైతులకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించవద్దని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుభీర్ మండలంలోని(Kubheer Mandal) మాలేగాం, కుంభి, లింగి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. మాలేగాం గ్రామ సమీపంలో "మొండి బసవన్న" వద్ద మలేగాం మాజీ సర్పంచ్ కే రేఖ శంకర్, ప్రస్తుత సర్పంచ్ శేల్కె లక్ష్మీ ఆనంద్ ఆధ్వర్యంలో సుద్ద వాగు బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంత రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి తమకు సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలకు ప్రస్తుతం నీరు అత్యవసరమని తెలిపారు. ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టామని, పంటలు చేతికి వచ్చే సమయంలో నీటిని నిలిపివేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖరీఫ్ లో సాగుచేసిన పసుపు ఇటీవల సాగు చేసుకున్న శనగ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేసుకున్న రైతులు వాటి ఎదుగుదలకు అవసరమైన నీరు అందకపోతే పంటలు చేతికి రావని ఆందోళన వ్యక్తం చేశారు.
సుద్ద వాగు బ్యాక్‌వాటర్‌ను ఆధారంగా చేసుకొని మాలేగాం, కుంభి, లింగి, సావున్లీ, న్యూ సాంవ్లీ, మిర్జాపూర్ గ్రామాల పరిధిలో వందలాదిమంది రైతులు సుద్ద వాగు ప్రాజెక్ట్ లో తమ విలువైన భూములను కోల్పోయి మిగిలి ఉన్న కొద్దో గొప్పో వ్యవసాయ భూముల్లో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలు, ఇతర నీటి వనరులపై ఆధారపడలేని పరిస్థితుల్లో బ్యాక్‌వాటర్ ద్వారా లభించే నీరే ఈ ప్రాంత రైతులకు ఆధారంగా ఉంది. ఇలాంటి సమయంలో మోటార్లు తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ సర్పంచులకు ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఆదేశాలు ఇవ్వడం సరికాదని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
పంటలు చేతికి వచ్చే వరకు నీటిని నిలిపివేయవద్దు
ఇప్పటికే పంటల సాగు కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశామని, ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో రైతులపై ఆర్థిక భారం అధికమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎదుగుతున్న ప్రస్తుత తరుణంలో నీటిని అందకుండా చేస్తే పెట్టిన పెట్టుబడులు వృథా అయ్యే ప్రమాదం ఉంది. పంటలు చేతికి వచ్చే వరకు సుద్ద వాగు బ్యాక్‌వాటర్ ద్వారా సాగునీటిని వినియోగించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. పంటలకు నీరు అందక దిగుబడి తగ్గితే రైతులు అప్పుల భారంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని మోటార్ల తొలగింపు నిర్ణయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పంటలు చేతికి వచ్చే వరకు నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.