అవినీతికి కేరాఫ్ అడ్రస్‌ నిజామాబాద్ కార్పొరేషన్

28-09-2026 | 08:29pm

- ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ధ్వజం

- మహేష్ కుమార్ గౌడ్ చేతకాకపోతే మేయర్‌తో రాజీనామా చేయించండి

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ మున్సిపల్(Nizamabad Municipal) కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఫ్లోర్ లీడర్  వి.ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana), బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  మాట్లాడుతూ... అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఇందూర్ కార్పొరేషన్ మారిందని,  ప్రతి బడ్జెట్ మీటింగ్ లో కోట్లు కేటాయిస్తారు కానీ పనుల కోసం రూపాయి ఖర్చు చేయడం లేదన్నారు.

అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ధర్నా చేస్తున్నానంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్పొరేషన్లు 150 కోట్ల ఆదాయం, 94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటున్నారు.  పదేళ్లు బీఆర్ఎస్(BRS) పాలించి మేయర్ వాళ్లే ఉన్నా అభివృద్ధి చేయలేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు.  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అభివృధ్ధి కొరకు 200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటివరకు విడుదల చేయలేరన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడి మేయర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు.

బీజేపీ(BJP) జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి గారు మాట్లాడుతూ గత ఏడు నెలలుగా మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు ప్రబలి, ప్రజారోగ్యం క్షీణించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధి కుక్కల బెడద తీవ్రమై ప్రజలను కరుస్తున్నాయి. కాంగ్రెస్ కుక్కలకు చెబుతున్నాం నెల రోజుల్లోగా ఈ కుక్కలను పట్టుకోకపోతే, వాటన్నింటినీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇంట్లోకి వదులుతామని హెచ్చరించారు. మహేష్ కుమార్ గౌడ్ బల్దియా సమస్యలను పరిష్కరించడం చేతకాకపోతే మీ మేయర్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశాడు. 

కార్పొరేషన్ ముట్టడిలో ఉద్రిక్తత

బల్దియా సమస్యల పరిష్కారానికి, కమిషనర్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నాచౌక్ లో ధర్నా అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు, బిజెపి కార్పొరేటర్లు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ , జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చే వరకు జరిగేది లేదని హెచ్చరించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలేసులకు, బిజెపి నాయకులకు తోపులాట జరిగింది. అనంతరం కమిషనర్ దిలీప్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు