ఎన్ఎంఆర్ఈసిలో వార్షిక క్రీడోత్సవం-2026 ప్రారంభం
ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని దివ్యనగర్‌లో ఉన్న నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(Nalla Malla Reddy Engineering College) వార్షిక క్రీడోత్సవాలు 2026 సోమవారం కళాశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి.
ఈనెల 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొంటున్నారు. కళాశాల కార్యదర్శి నల్ల మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో క్రీడల ప్రాధాన్యాన్ని వివరించారు. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని పేర్కొంటూ, క్రమశిక్షణ, పట్టుదల, జట్టుస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఐక్యత, దృఢసంకల్పం, క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా క్రీడా జ్యోతిని వెలిగించి, కళాశాల నుంచి జె.ఎన్.టి.యు.హెచ్ కి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు అందజేయడంతో క్రీడోత్సవాలకు అధికారిక ఆరంభం లభించింది. కళాశాల చైర్ పర్సన్ కేతిరెడ్డి సద్యవాళి వార్షిక క్రీడా పోటీలు 2026ను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల, ట్రెజరర్ డాక్టర్ స్నేహ నల్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎన్.వి. రమేష్, ఇతర ప్రముఖులు, కళాశాల అధికారులు పాల్గొన్నారు.