ఆరుతడి పంటలనే సాగు చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

27-10-2026 | 06:55pm

బోధన్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు రబీ సీజన్‌లో ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ తక్కువ నీటితో పండే పంటలను ఎంపిక చేసుకోవాలని ఆమె రైతులకు హితవు పలికారు. నందిపేట మండలంలోని నూత్‌పల్లి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షపాతం లోటును దృష్టిలో ఉంచుకొని రబీ సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.

నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. అధిక నీటి అవసరమయ్యే పంటల సాగుతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. రబీ సీజన్‌లో ఆరుతడి పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పంటల సాగులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేపట్టాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు