ఎస్సారెస్పీలో దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం
కాపాడిన జెన్ కో సిబ్బంది
ఆర్మూర్, నవంబర్27 (విజయ క్రాంతి) : కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య(Suicide) చేసుకోవడానికి యతించిన వ్యక్తిని ఎస్సారెస్పీ జెన్ కో(SSRSP Gen Co.) సిబ్బంది కాపాడి అందరి మన్ననలు పొందారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామానికి చెందిన అనురూప్ కుటుంబంలో జరిగిన గొడవల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఎస్సారెస్పీకి వచ్చాడు.
నీళ్లలో దూకిన అతన్ని గమనించిన జెన్ కో సిబ్బంది హుటాహుటిన నీళ్లలో దూకి అతన్ని కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డ్యామ్‌పైకి చేరుకుని అతడిని గుర్తించారు. కౌన్సిలింగ్ నిర్వహించి అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. అనురూప్‌ను కాపాడటంలో సహకరించిన జెన్‌కో సిబ్బంది షూకూర్, నాగమణి, అక్బర్, పిబ్రి, దశరథ్, నిర్మలలను ఎస్సై సుహాసిని ప్రత్యేకంగా అభినందించారు.