నేరాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ సమీక్ష
బోధన్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నిజామాబాద్ డివిజన్ (Nizamabad Division) పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్త్స్రలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దాడులు నిర్వహించి, నిందితులపై అవసరమైతే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్లైన్ మోసాల బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.
హత్యలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, పేకాట, గుట్కా తదితర కేసులను సమీక్షించి, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయ్పి ఉన్న నిందితులపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి పహారా, వాహన తనిఖీలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్స్పాట్లను గుర్తించి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు,
లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, రోడ్లకు అడ్డుగా ఉన్న పొదల తొలగింపు వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్ల వాహన నడపడంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తును పటిష్టం చేయాలని,
వాహన తనిఖీలు 24 గంటలూ కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలకు అత్యవసర సమయంలో డయల్ 112 సేవలను వినియోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.