సంవిధాన్ రక్షక్ ర్యాలీని విజయవంతం చేయాలి

25-11-2026 | 06:18pm

ఆలేరు, నవంబర్ 25 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం (Constitution) దేశ ప్రజలకు కల్పించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, రాజ్యాంగ పరిరక్షణ (Protection) కోసం ప్రతి ఒక్కరూ పోరాటంలో భాగస్వాములు కావాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంవిధాన్ రక్షక్ ర్యాలీని (Rally) విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం భువనగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి విలువైన హక్కులను కల్పించిందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ అనేది రాజకీయ పార్టీలకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన బాధ్యత అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, మేధావులు, యువత, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించే ర్యాలీకి భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో భువనగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ నమ్మిండ్ల శ్రీనివాస్, ఆలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి మల్లయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్, పట్టణ, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు