బాబాల వేషంలో వచ్చి బురిడీ

05-11-2026 | 10:04am

పూజల పేరుతో మోసం.. 9 గ్రాముల బంగారం, రూ.45 వేలు మాయం

సిర్గాపూర్, నవంబర్ 5 (విజయక్రాంతి): బాబాల వేషంలో(Fake Babas) గ్రామంలోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను మాయమాటలతో నమ్మించి బంగారం, నగదును కాజేసిన ఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy) సిర్గాపూర్ మండలం ఉజ్లంపాడు గ్రామంలో వెలుగుచూసింది. పూజలు చేస్తామంటూ నమ్మించి 9 గ్రాముల బంగారంతో పాటు రూ.45 వేల నగదును అపహరించి నిందితులు పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం కొంతమంది వ్యక్తులు బాబాలమంటూ గ్రామంలో బిక్షాటన చేస్తూ యాదవరావు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన భార్యతో మాటలు కలిపి, ఆమెకు దోషం ఉందని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్మించారు.

వారి మాటలను విశ్వసించిన మహిళ వద్ద ఉన్న 9 గ్రాముల బంగారం, రూ.45 వేల నగదును పూజల పేరుతో వారికి అప్పగించింది. అనంతరం వాటిని తీసుకున్న వ్యక్తులు అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యారు. ఈ ఘటనతో బాధిత కుటుంబం షాక్‌కు గురైంది. బాధితుల Complaint మేరకు సిర్గాపూర్ ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి Investigation ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బాబాలమంటూ, పూజల పేరుతో మాయమాటలు చెప్పి బంగారం, నగదు తీసుకునే గుర్తుతెలియని వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మహేష్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఎలాంటి అనుమతి లేదా ధృవీకరణ లేకుండా విలువైన వస్తువులను అపరిచితులకు అప్పగించవద్దని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు