విద్యార్థులకు భద్రతపై అవగాహన

25-11-2026 | 06:58pm

మేడిపల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీఐ డి. జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు భద్రతపై అవగాహన (Safety Awareness) కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళల భద్రత, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యూపీఐ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు చేసే మోసాల (Cyber Crimes) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్ప్రభావాలను వివరించారు.

మహిళలు, బాలికల భద్రతకు సంబంధించి గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఆపద సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటించడం, హెల్మెట్ ధరించడం, వేగ నియంత్రణ వంటి అంశాలను తెలియజేశారు. కల్తీ ఆహార పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించారు.

విద్యార్థులు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు