పెన్షన్ తొలగింపుపై వికలాంగుల ఆందోళన
ముత్తారం ఎంపీడీవో కార్యాలయంపైకి ఎక్కి పురుగుల మందు తాగే యత్నం
పెన్షన్ పునరుద్ధరించి న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు
ముత్తారం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): వికలాంగుల పెన్షన్ నిలిపివేయడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు వికలాంగులు ఎంపీడీవో కార్యాలయంపైకి ఎక్కి పురుగుల మందు తాగే ప్రయత్నం చేసిన ఘటన ముత్తారం మండల(Muttaram Mandal) కేంద్రంలో బుధవారం కలకలం రేపింది.
మండలంలోని రామకృష్ణాపూర్ (ఇప్పలపల్లి) గ్రామానికి చెందిన సూరం రాజబాపు, పెద్దపల్లి సత్తయ్యలకు గతంలో అందుతున్న వికలాంగుల పెన్షన్‌ను ఇటీవల నిలిపివేయడంతో తీవ్ర ఆవేదనకు గురైనట్లు సమాచారం. తమకు ఆసరాగా ఉన్న పెన్షన్‌ను అకస్మాత్తుగా తొలగించడంతో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ క్రమంలో బుధవారం ముత్తారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బాధితులు కార్యాలయంపైకి ఎక్కి పురుగుల మందు తాగే ప్రయత్నం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి వారిని కిందకు దించేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనతో ఎంపీడీవో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వికలాంగులకు అందుతున్న పెన్షన్లను ఏ కారణంతో నిలిపివేశారని, అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమకు ఆసరాగా ఉన్న వికలాంగుల పెన్షన్‌ను వెంటనే పునరుద్ధరించి న్యాయం చేయాలని సూరం రాజబాపు, పెద్దపల్లి సత్తయ్య కోరుతున్నారు.